: అశోక్ ఈజ్ గ్రేట్... విజయనగర ‘రాజు’కి ప్రధాని కితాబు
విజయనగర రాజ వంశస్థుడు, టీడీపీ సీనియర్ నేత, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అశోక గజపతిరాజు అలనాటి అశోక చక్రవర్తిలాగే వినూత్న రీతిలో అభివృద్ధిలో దూసుకుపోతున్నారు. తత్ఫలితంగా తన నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో నడపడమే కాక ఇతర రాజకీయ నేతలకు ఆదర్శప్రాయంగా నిలుస్తున్నారు. ఇదేదో మీడియా నివేదికలో, స్వచ్ఛంద సంస్థలో చెబుతున్న విషయం కాదు. సాక్షాత్తు ప్రధాని నరేంద్ర మోదీ ఈ విషయాన్ని నొక్కి వక్కాణిస్తున్నారు. అసలు విషయమేంటంటే... సంసద్ ఆదర్శ గ్రామ యోజన కింద తన సొంత నియోజకవర్గంలోని ద్వారపూడి గ్రామాన్ని దత్తత తీసుకున్న అశోక గజపతిరాజు, గ్రామంలో అక్షరాస్యత పెంపునకు వినూత్న చర్యలు చేపట్టారు. గ్రామంలోని పాఠశాలలో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులు సాయంత్రం పూట అదే పాఠశాలలో తమ తల్లిదండ్రులతో అక్షరాలు దిద్దిస్తున్నారు. ఫలితంగా గ్రామంలో ఒక్క పైసా నిధులు ఖర్చు కాకుండానే అక్షరాస్యత మెరుగుపడింది. ఈ విషయంపై సమగ్ర వివరాలు అందుకున్న ప్రధాని మోదీ నిన్నటి ‘మన్ కీ బాత్’లో ఈ విషయాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. నయా పైసా ఖర్చు లేకుండా, ప్రణాళిక అసలే లేకుండానే అశోక గజపతిరాజు తన దత్తత గ్రామంలో అక్షరాస్యతను పెంపొందించారని ప్రశంసించారు. అశోక గజపతిరాజు తీసుకున్న చర్యలు ఇతరులకు ఆదర్శవంతంగా ఉన్నాయని ప్రధాని అభినందించారు.