: కృపామణి కేసు విచారణకు ప్రత్యేక కోర్టు... పోలీసులను ముప్పుతిప్పలు పెడుతున్న నిందితులు
పశ్చిమగోదావరి జిల్లా తణుకు మండలం వేల్పూరులో తల్లిదండ్రులు, సోదరుడు, ఓ రౌడీ షీటర్ వేధింపుల కారణంగా ఆత్మహత్య చేసుకున్న గృహిణి కృపామణి ఆత్మహత్య ఘటనను ఏపీ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. కన్న తల్లిదండ్రులే వ్యభిచారం చేయాలంటూ ఒత్తిడి తేవడంతో తట్టుకోలేక కృపామణి ఆత్మహత్య చేసుకుంది. ఇదే విషయాన్ని ఆమె సూసైడ్ నోట్ రాయడంతో పాటు సెల్ఫీ వీడియోలో స్పష్టం చేసి మరీ చనిపోయింది. పోలీసుల విచారణలో వెలుగుచూసిన ఈ వీడియో తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపింది. ఈ వీడియో బహిర్గతం కాగానే కృపామణి తల్లిదండ్రులతో పాటు రౌడీ షీటర్ శ్రీనివాస్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. తమ సెల్ ఫోన్లను ఆఫ్ చేసుకున్న నిందితులు గుట్టుగా దాక్కున్నారు. వీరి ఆచూకీ కోసం పోలీసులు నానా తంటాలు పడుతున్నారు. ఇక ఈ కేసుపై దృష్టి సారించిన ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. చంద్రబాబు ఆదేశాలతో ప్రత్యేక బృందాలను రంగంలోకి దించిన పోలీసులు జిల్లా వ్యాప్తంగా గాలిస్తున్నా నిందితుల ఆచూకీ లభించడం లేదు. దీంతో ప్రభుత్వానికి ఏం చెప్పాలో తెలియక పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. ఇదిలా ఉంటే, ఈ కేసు విచారణ కోసం ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.