: గంగూలీని దూషించిన గంభీర్: మనోజ్ తివారీ
మూడు రోజుల క్రితం ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా మైదానంలో రంజీ మ్యాచ్ సందర్భంగా మనోజ్ తివారీ, గౌతమ్ గంభీర్ ల మధ్య జరిగిన గొడవ మరింతగా పెరుగుతోంది. ఈ ఘటనపై మ్యాచ్ రిఫరీలు ఇరువురిపైనా జరిమానా విధించినా, గొడవ మాత్రం సద్దుమణగ లేదు. తాజాగా మనోజ్ తివారీ, గంభీర్ పై తీవ్ర ఆరోపణలు చేశాడు. తనతో పాటు సౌరవ్ గంగూలీని కూడా గంభీర్ తిట్టాడని, మొత్తం బెంగాలీలపై అనుచిత వ్యాఖ్యలు చేశాడని, విషయం తెలిసి గంగూలీ సైతం బాధపడ్డాడని తెలిపాడు. గంభీర్ తాను చేసిన తప్పును దాస్తున్నాడని, అంపైర్ ను అతను తోసేస్తున్నప్పటి వీడియో కూడా ఉందని చెప్పాడు. హద్దులు దాటిన గంభీర్ గంగూలీ తల్లిదండ్రులనూ దూషించాడని అన్నాడు. కాగా, తివారీ తాజా ఆరోపణలను గంభీర్ కొట్టిపారేశాడు. గంగూలీ తనకు అత్యంత ఇష్టమైన కెప్టెన్ అని, మనోజ్ నిరాధార ఆరోపణలు చేస్తున్నాడని అన్నాడు. బెంగాల్ తనకు రెండవ ఇంటి లాంటిదని తెలిపాడు. కాగా, వీరిద్దరి గొడవలపై పూర్తి నివేదిక బీసీసీఐకి చేరింది. దీనిపై విచారించిన తరువాత శాఖాపరమైన చర్యలను బీసీసీఐ ప్రకటించనుంది.