: టీమిండియాను చీల్చి చెండాడిన డుప్లెసిస్... సాయం చేసిన ధోనీ!


ఫ్రీడమ్ సిరీస్ లో భాగంగా టీ20 టైటిల్ ను అప్పటికే గెలిచేసిన దక్షిణాఫ్రికా జట్టు, నిన్న ముంబై వాంఖడే స్టేడియంలో జరిగిన మ్యాచ్ గెలిచి వన్డే టైటిల్ ను కూడా ఎగురవేసుకుపోయింది. నిన్నటి మ్యాచ్ లో చెలరేగిపోయిన సఫారీ బ్యాట్స్ మెన్ డికాక్, డుప్లెసిస్, డివిలియర్స్ సెంచరీలతో వీరవిహారం చేశారు. ఈ ముగ్గురిలోకి డుప్లెసిస్ తనదైన శైలిలో బౌండరీలతో విరుచుకుపడ్డాడు. స్పిన్, సీమ్ అన్న తేడా లేకుండా వచ్చిన ప్రతి బంతిని డుప్లెసిస్ బౌండరీకి తరలించాడు. తొడ కండరాల నొప్పితో ఓ పక్క విలవిల్లాడుతూనే అతడు చేసిన వీరోచిత పోరాటం దక్షిణాఫ్రికా భారీ స్కోరుకు గట్టి పునాదులు వేసింది. అదలా ఉంచితే, ఘోర పరాభవం ఎదురైన మ్యాచ్ లో కెప్టెన్ కూల్ పరాయి జట్టుకు సాయమెప్పుడు చేశాడనేగా? మీ అనుమానం. సాయమంటే, పరుగులు ఇచ్చాడని కాదులెండి. క్రీడా స్ఫూర్తితో వ్యవహరించిన ధోనీ, తొడ కండరాలు పట్టేయడంతో నడవడానికే ఇబ్బంది పడుతున్న డుప్లెసిస్ కు కాసింత ఉపశమనం కలిగేలా చేశాడు. అప్పటికే ఓసారి ఫిజియోతో వైద్యం చేయించుకున్న డుప్లెసిస్ మరోమారు పిచ్ పై పడిపోయాడు. నొప్పితో గింగిరాలు తిరుగుతున్నాడు. ఆ సమయంలో ఫిజియో వచ్చేందుకు కొంత టైమ్ తీసుకుంది. ఈ సమయంలో పిచ్ పై నొప్పితో మెలికలు తిరుగుతున్న డుప్లెసిస్ దగ్గరకు వెళ్లిన ధోనీ, అతడి కాళ్లను పైకెత్తిపట్టి నొప్పి నుంచి ఉపశమనం కల్పించాడు.

  • Loading...

More Telugu News