: ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఆరుగురు సఫారీలు విరుచుకుపడ్డారు...భారత్ లక్ష్యం 439 పరుగులు


పరిమిత ఓవర్ల మ్యాచ్ టీట్వంటీల్లో ఒకరు చెలరేగితేనే భారీ స్కోరు నమోదవుతుంది. అలాంటిది 50 ఓవర్ల మ్యాచ్ లో దిగిన ప్రతి ఒక్కరూ చెలరేగితే ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే నేడు ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన మ్యాచ్ చూస్తే తెలిసిపోతుంది. ఒకరు కాదు, ఇద్దరు కాదు, మొత్తం ఆరుగురు ఆటగాళ్లు వరుసగా విరుచుకుపడి భారత బౌలర్లను చేష్టలుడిగేలా చేశారు. సఫారీల వేట క్రికెట్ అభిమానులకు ఆటలోని అసలు మజాను పంచింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సౌతాఫ్రికా జట్టు బ్యాటింగ్ ను హషీమ్ అమ్లా (13 బంతుల్లో 23), డికాక్ (87 బంతుల్లో 109) ప్రారంభించారు. ఆమ్లా తొందరగా అవుట్ కావడంతో డుప్లెసిస్ (115 బంతుల్లో 133) జతగా డికాక్ ఛార్జ్ తీసుకున్నాడు. భారీ షాట్లు ఆడుతూ రన్ రేట్ పెంచాడు. వీరి దూకుడుకి వన్డే మ్యాచ్ కాస్తా టీట్వంటీలా మారింది. డికాక్ సెంచరీ తరువాత ఆటలో మరింత వేగం పెంచే ప్రయత్నంలో భారీ షాట్ కు యత్నించి కోహ్లీకి క్యాచ్ ఇచ్చాడు. అనంతరం డివిలియర్స్ దిగాడు. డికాక్ పెంచిన వేగాన్ని డుప్లెసిస్ అందుకున్నాడు. అర్ధ సెంచరీ తరువాత డుప్లెసిస్ వేగం అందుకోగా, డివిలియర్స్ (61 బంతుల్లో 119) క్రీజులో అడుగు పెట్టిన నాటి నుంచి భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. దీంతో బంతులను బౌండరీ లైన్ దాటడమే లక్ష్యంగా మారిపోయింది. ఇంతలో డుప్లెసిస్ కాలి కండరాలు పట్టేయడంతో రిటైర్డ్ హర్ట్ గా వెనుదిరిగాడు. అంతే... డివిలియర్స్ రెచ్చిపోయాడు. దీంతో, స్కోరు బోర్డు ఒక్కసారిగా జెట్ స్పీడు అందుకుంది. చివర్లో డివిలియర్స్ ధోనీకి క్యాచ్ ఇచ్చినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అనంతరం దిగిన డేవిడ్ మిల్లర్ (12 బంతుల్లో 22), బెహర్దీన్ (10 బంతుల్లో 16), ఎల్గర్ (2 బంతుల్లో 5) భారీ షాట్లు ఆడడంతో సౌతాఫ్రికా జట్టు నిర్ణీత 50 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 438 పరుగులు చేసింది. సఫారీల్లో ముగ్గురు ఆటగాళ్లు సెంచరీలు చేయడం విశేషం. భారత బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, మోహిత్ శర్మ, హర్భజన్ సింగ్, సురేష్ రైనా తలో వికెట్ తీశారు. భారత బౌలర్లంతా భారీ స్కోరు సమర్పించడం విశేషం. 439 పరుగుల విజయ లక్ష్యంతో భారత జట్టు కాసేపట్లో బ్యాటింగ్ ప్రారంభించనుంది. టీమిండియా ఓపెనర్లు అంచనాలకు మించి రాణిస్తే తప్ప విజయం సాధించడం అసాధ్యమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

  • Loading...

More Telugu News