: క్రికెట్ ఫీస్ట్... వాంఖడేలో విజయం ఎవరిదో!


ఐదు వన్డేల 'గాంధీ-మండేలా' సిరీస్. ఇప్పటికే నాలుగు మ్యాచ్ లు ముగిసిపోయాయి. ఐదో వన్డో మరికొన్ని గంటల్లో ముంబైలోని సుప్రసిద్ధ వాంఖడే స్టేడియంలో జరుగుతుంది. చెరో రెండు మ్యాచ్ లను గెలుచుకుని సమ ఉజ్జీలుగా ఉన్న భారత్, దక్షిణాఫ్రికాలు నిర్ణయాత్మకమైన పోరులో తమ సత్తాను చాటేందుకు ఎదురుచూస్తున్నాయి. ఈ మ్యాచ్ లో ఎవరు విజయం సాధిస్తే, ట్రోఫీ వారికి లభిస్తుంది. ఇరు జట్లూ సమాన బలంతో కనిపిస్తుండగా, సొంత గడ్డపై ఆడనుండటం భారత్ కు అనుకూలాంశం. ప్రస్తుతానికి 2-2 గా ఉన్న ఫలితాన్ని 3-2గా ఎవరు మారుస్తారోనని సగటు క్రీడాభిమాని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా, వాంఖడే స్టేడియంలో దక్షిణాఫ్రికాతో భారత జట్టు ఇప్పటివరకూ మూడు మ్యాచ్ లు ఆడగా, మూడింటిలో ఇండియా గెలిచింది. అదే సెంటిమెంట్ పునరావృతమైతే గెలుపు కచ్ఛితంగా భారత్ దే. ఇక గత నాలుగు మ్యాచ్ లలో రోహిత్ 239 పరుగులతో, కోహ్లీ 238 పరుగులతో మంచి ఫామ్ లో ఉండటం, ధోనీ విజృంభించి కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడటం అభిమానులకు గెలుపుపై ధీమాను పెంచుతుంది. మరోవైపు దక్షిణాఫ్రికా సైతం గెలుపు తమదేనని అంటోంది. ఈ మ్యాచ్ లో టాస్ అత్యంత కీలకమని క్రికెట్ నిపుణులు అంటున్నారు. వాంఖడేలో జరిగిన చివరి నాలుగు మ్యాచ్ లలో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న జట్టే విజయం సాధించింది. ఇక ఎండ కారణంగా ఉక్కపోత అధికంగా ఉండటం ఆటగాళ్లను ఇబ్బంది పెట్టనుండగా, పిచ్ స్పిన్నర్లకు అనుకూలిస్తుందని అంచనా. ఏదిఏమైనా ఈ హోరాహోరీగా సాగనున్న ఈ మ్యాచ్, అభిమానులకు కనులవిందే అనడంలో సందేహం లేదు.

  • Loading...

More Telugu News