: మోదీకి ఘనస్వాగతం పలికిన ఆ సంస్థ చైనాకు వెళ్లిపోతోంది!
ఇండియాలో వ్యాపారం నిర్వహించే అవకాశాలు అంతంతమాత్రంగానే ఉన్నాయని టెస్లా అభిప్రాయపడుతోంది. దీంతో ఇండియాలో పెట్టాలనుకున్న ఉత్పత్తి కేంద్రాన్ని చైనాకు తరలించాలని భావిస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనలో భాగంగా, ఆయనకు ఘనస్వాగతం పలికిన సిలికాన్ వ్యాలీ ఎలక్ట్రిక్ కార్ల సంస్థ టెస్లా, తమ నూతన ప్లాంటును ఇండియాలో పెట్టాలని భావిస్తున్నట్టు ఆ సమయంలో వెల్లడించిన సంగతి తెలిసిందే. ఆపై పరిస్థితులను అధ్యయనం చేసిన సంస్థ చీఫ్ ఎలాన్ ముస్క్ ఇప్పుడు చైనా ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. మరో మూడేళ్లలో టెస్లా సంస్థ చైనాలో కార్లను తయారు చేసి మార్కెట్లోకి పంపుతుందని చైనా మీడియా కథనాలను ప్రచురించింది. చైనాతో పోలిస్తే, ఇండియాలో రాజకీయ అనిశ్చితి అధికంగా ఉండటం, నియంత్రణ ఎక్కువగా ఉండటంతో టెస్లా చైనాకు తరలిపోతున్నట్టు తెలుస్తోంది. కాగా, ప్రస్తుతం కాలిఫోర్నియాలో కార్లను తయారు చేస్తున్న టెస్లా, ఇటీవలే నెదర్లాండ్స్ లో ఓ తయారీ కేంద్రాన్ని ప్రారంభించింది.