: బాహుబలి రొట్టె కావాలా? అయితే, నెల్లూరు వెళ్లాల్సిందే!
నెల్లూరు నగరంలోని ప్రముఖ బారా షహీద్ దర్గాలో రొట్టెల పండగ వైభవంగా జరుగుతోంది. ఈ దఫా 'బాహుబలి' రొట్టెలు అక్కడ భారీ ఎత్తున చేతులు మారుతున్నాయి. మామూలు రొట్టెల సైజుతో పోలిస్తే ఇవి లావుగా ఉంటాయి. ఇవి కావాలంటే నెల్లూరుకు వెళ్లాల్సిందే. భక్తులు తమ కోరికలు నెరవేరడానికి రొట్టెలను కొనుగోలు చేసి, అప్పటికే కోరికలు నెరవేరిన వారితో వాటిని మార్పిడి చేసుకుంటారు. మొహర్రం నెల మొదటి రోజు నుంచి దర్గాలో నాలుగు రోజుల పాటు జరిగే రొట్టెల పండగకు దాదాపు 15 లక్షల మందికి పైగా భక్తులు వస్తారని అంచనా. 'బాహుబలి' రొట్టెలతో పాటు, 'శ్రీమంతుడు' రొట్టెలు, 'బ్రూస్ లీ' రొట్టెలు కూడా ప్రజలను ఆకర్షిస్తున్నాయి. పండగ చరిత్రను చెప్పేలా దర్గా పక్కనే ఉన్న చెరువులో ఏర్పాటు చేసిన లేజర్ షోను తిలకించేందుకు భక్తులు పోటీ పడుతున్నారు.