: నీవల్ల పరువు పోయింది... నీ మాదిరి కోవర్టునా?... ట్రస్ట్ భవన్ సాక్షిగా రేవంత్, ఎర్రబెల్లి మాటల యుద్ధం
తాను తొలగించిన పీఏకు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో రేవంత్ రెడ్డి ఉద్యోగం ఇవ్వడాన్ని ఎర్రబెల్లి దయాకర్ రావు తీవ్రంగా ఆక్షేపించారు. ఈ విషయంలో మాటలు కోటలు దాటగా, ఒకరినొకరు నువ్వెంతంటే నువ్వెంతని వ్యక్తిగత విమర్శలు చేసుకునేంత వరకూ వెళ్లింది. వివరాల్లోకి వెళితే, రేవంత్ రెడ్డి జైలు నుంచి విడుదలైన రోజున జరిగిన ర్యాలీలో ఎర్రబెల్లి పీఏ కూడా పాల్గొన్నాడట. విషయం తెలుసుకున్న ఎర్రబెల్లి తన దగ్గర్నుంచి ఆ వ్యక్తిని తొలగిస్తే, రేవంత్ అతనికి ట్రస్ట్ భవన్ లో ఉద్యోగమిచ్చాడు. అది తెలుసుకున్న ఎర్రబెల్లి "నేను తొలగించిన మనిషిని ఎట్లా పెడతావు? అంతా నీ ఇష్టమేనా?" అని తనకెదురుపడిన రేవంత్ ను ప్రశ్నించగా, "అభిమానంతో నా దగ్గరికొస్తే ఉద్యోగం తీసేస్తవా? రెడ్డోడు టీడీఎల్పీలో పని చేయద్దా? నేను జీతమిస్తుంటే, నీ పెత్తనమేంది?" అంటూ విరుచుకుపడ్డారు. నీవల్ల రాష్ట్రంలో పరువు పోయిందని ఎర్రబెల్లి, నీ మాదిరిగా కోవర్టును కాదని రేవంత్ రెడ్డి తిట్లదండకాన్ని అందుకున్నారు. అక్కడే ఉన్న సీనియర్ నేతలు కల్పించుకుని వీరిని విడదీయాల్సి వచ్చింది. ఆపై తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ కల్పించుకుని, రేవంత్ చేసిన పనిని తప్పుబట్టారని తెలుస్తోంది. ఎర్రబెల్లి తీసేసిన వ్యక్తిని తిరిగి పెట్టడం ఎందుకని ప్రశ్నించిన ఆయన, దూకుడు తగ్గించుకోవాలని సలహా ఇచ్చారట.