: దెబ్బలు తింటావు జాగ్రత్త... మనోజ్ తివారీని హెచ్చరించిన గంభీర్
జెంటిల్మన్ గేమ్ లో పెను వివాదం రాజుకుంది. ఢిల్లీ, పశ్చిమ బెంగాల్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్ లో రెండు జట్ల కెప్టెన్ల మధ్య గొడవ మొదలై అది కొట్టుకునే వరకు వెళ్లింది. వివరాల్లోకి వెళ్తే... ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల మైదానంలో ఢిల్లీ, బెంగాల్ జట్ల మధ్య రంజీ మ్యాచ్ ప్రారంభమైంది. ఢిల్లీ బౌలర్ మనన్ శర్మ బౌలింగ్ లో పార్థసారధి భట్టాచార్జీ అవుటయ్యాడు. దీంతో నాలుగో స్థానంలో బెంగాల్ కెప్టెన్ మనోజ్ తివారీ బ్యాటింగ్ కు క్యాప్ ధరించి వచ్చాడు. గార్డ్ తీసుకుని బ్యాటింగ్ కు సిద్ధమయ్యాడు. ఇంతలో మనన్ శర్మ బంతి సంధించేందుకు సిద్ధమై రనప్ ప్రారంభించాడు. ఈలోగా మనోజ్ తివారీ అతనిని ఆపి, పెవిలియన్ లో ఉన్న సహచరులను హెల్మెట్ తేవాలని సైగ చేశాడు. దీంతో గంభీర్ కు చిర్రెత్తుకొచ్చింది. బ్యాటింగ్ కు వచ్చేటప్పుడు హెల్మెట్ తీసుకురావాలని తెలియదా? అంటూ గంభీర్ మండిపడ్డాడు. కాస్త పరుషంగా మాట్లాడాడు. దీంతో గంభీర్ కు మనోజ్ తివారీ సమాధానం చెప్పాడు. అంతే, గంభీర్ నోటికి పని చెప్పాడు. తివారీ కూడా దీటుగా స్పందించడంతో...జాగ్రత్తగా ఉండకపోతే తన చేతుల్లో దెబ్బలు తినాల్సి వస్తుందని గంభీర్ హెచ్చరించాడు. దానికి కూడా తివారి సమాధానం చెప్పడంతో వివాదం ముదురుతోందని గ్రహించిన అంపైర్ శ్రీకాంత్, గంభీర్ ను అడ్డుకునే ప్రయత్నం చేశాడు. అతనిని కూడా తోసుకుంటూ గంభీర్ దూసుకువెళ్లి మరీ మనోజ్ తివారీని హెచ్చరించడం విశేషం.