: ఇంటిలో వ్యక్తి ఉండగానే ఇంటిని కూల్చేసిన జీహెచ్ఎంసీ అధికారులు
అక్రమ కట్టడాల కూల్చివేత అంటూ బయలుదేరిన గ్రేటర్ హైదరాబాదు మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) అధికారులు కొద్దిసేపటి క్రితం ఓవరాక్షన్ చేశారు. నగరంలోని జవహర్ నగర్ కు ప్రొక్లెయినర్లతో తరలి వెళ్లారు. అక్కడ అక్రమ నిర్మాణమని గుర్తించిన ఓ ఇంటిని కూల్చివేసేందుకు సన్నద్ధమయ్యారు. అంతే, ముందు వెనుకా చూసుకోకుండా ప్రొక్లెయినర్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇంటి పైకప్పు కూలగానే ఇంటిలో నుంచి ఓ వ్యక్తి మూలుగులు వినిపించాయి. షాక్ తిన్న గ్రేటర్ ఉద్యోగులు పరుగు పరుగున అక్కడి వెళ్లి చూడగా, శిథిలాల కింద ఓ వ్యక్తి పడి ఉన్నాడు. అంటే, ఇంటిలో మనుషులున్నారా? లేరా? అన్న విషయాన్ని నిర్ధారించుకోకుండానే వారు ఇంటిని కూల్చేశారన్నమాట. గ్రేటర్ అధికారుల నిర్వాకం కారణంగా సదరు వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. శిథిలాలను తొలగించిన సిబ్బంది బాధితుడిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.