: కలకలం రేపుతున్న కృపామణి వీడియో... వేధించిన దుర్మార్గుడిపై రౌడీ షీట్
పశ్చిమగోదావరి జిల్లా తణుకు మండలం వేల్పూరులో కన్నవారి ఒత్తిడితో పరాయి వ్యక్తికి శరీరాన్ని అప్పగించి చివరకు మనోవేదనతో ఆత్మహత్య చేసుకున్న కృపామణి ఘటన తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతోంది. చనిపోయే ముందు కారణాలను చెబుతూ బాధితురాలు రికార్డు చేసిన వీడియో తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ వీడియోలో తనను తన పుట్టింటివారు వేధించిన తీరు, కామాంధుడు సాయి శ్రీనివాస్ పెట్టిన వేధింపులను ఆమె కళ్లకు కట్టినట్లు చెప్పింది. బెదిరించి తనను నగ్నంగా మార్చి ఫొటోలు, వీడియోలు తీసిన శ్రీనివాస్ నెలల పాటు అఘాయిత్యం చేశాడని ఆమె కన్నీటి పర్యంతమైంది. మంచి పలుకుబడి కలిగిన సాయి శ్రీనివాస్ కారణంగానే అమాయకుడైన తన భర్త జైలు పాలయ్యాడని, తనపై వేధింపులకు సంబంధించి కేసు పెట్టినా ఒరిగేదేమీ లేదని తెలుసుకున్నాకే చనిపోతున్నానంటూ ఆమె చెప్పిన తీరు ఈ వీడియోను చూసిన వారిని కంటతడి పెట్టిస్తోంది. ఈ వీడియో బయటకు రాగానే సాయి శ్రీనివాస్ తో పాటు కృపామణి తల్లిదండ్రులు కూడా పరారయ్యారు. బాధితురాలి ఇంటిలో సోదాలు చేసిన పోలీసులకు వీడియో చిక్కింది. దీని ఆధారంగా సాయి శ్రీనివాస్ పై పోలీసులు రౌడీ షీట్ తెరిచారు. ఇక ఇతడిపై జిల్లాలోని ఉండ్రాజవరం పోలీస్ స్టేషన్ లోనూ లైంగిక వేధింపులకు సంబంధించిన కేసులు నమోదైనట్లు తేలింది. ప్రస్తుతం ఆ దుర్మార్గుడి కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు.