: తెరాస భవన్ లో టీఆర్ఎస్, ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో టీ టీడీపీ... ఓరుగల్లు అభ్యర్థిపై మల్లగుల్లాలు
వరంగల్ లోక్ సభ స్థానానికి ఉప ఎన్నికకు రంగం సిద్ధమైంది. తెలంగాణలో ఇటు అధికార పార్టీ టీఆర్ఎస్, అటు ప్రతిపక్షం టీ టీడీపీకి అత్యంత ప్రతిష్ఠాత్మకంగా మారిన ఈ ఎన్నికకు సంబంధించి ఇప్పటిదాకా రెండు పార్టీల అభ్యర్థులు ఖరారు కాలేదు. వామపక్షాలు వాటి ఉమ్మడి అభ్యర్థిగా గాలి వినోద్ కుమార్ ను బరిలోకి దింపనున్నాయి. ఈయన ఇప్పటికే ప్రచారంలోకి దిగేశారు. ఇక ఎన్నికల షెడ్యూల్ విడుదల కానున్న నేపథ్యంలో టీఆర్ఎస్, టీ టీడీపీలు తమ అభ్యర్థులను ప్రకటించేందుకు రంగం సిద్ధం చేస్తున్నాయి. టీఆర్ఎస్ కీలక నేతలు తెరాస భవన్ లో కొద్దిసేపటి క్రితం సమావేశమయ్యారు. మరోవైపు టీ టీడీపీ కూడా ఈ దిశగా వడివడిగా అడుగులేస్తోంది. మిత్రపక్షం బీజేపీ టికెట్ అడుగుతున్నా, అందుకు టీ టీడీపీ నేతలు ససేమిరా అంటున్నారు. తామైతేనే టీఆర్ఎస్ కు గట్టి పోటీ ఇవ్వగలమని వాదిస్తున్న టీ టీడీపీ నేతలు తమ పార్టీ అభ్యర్థినే బరిలోకి దింపేందుకు దాదాపుగా నిర్ణయించాయి. మరికాసేపట్లో టీ టీడీపీ కీలక నేతలు అభ్యర్థి ఖరారుకు సంబంధించి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో కీలక భేటీ నిర్వహించనున్నారు.