: ఐపీఎల్-9లో ధోనీ ఆడతాడు... ఎల్లో జెర్సీ మాత్రం మారిపోతుందట!
కెప్టెన్ కూల్, టీమిండియా వన్డే, టీ20 జట్ల సారథి మహేంద్ర సింగ్ ధోనీ వచ్చే ఏడాది జరగనున్న ఐపీఎల్-9 సీజన్ లోనూ కనిపిస్తాడట. ఫిక్సింగ్ ఆరోపణలతో ఇప్పటిదాకా అతడు ఆడుతూ వస్తున్న చెన్నై సూపర్ కింగ్స్ తో పాటు రాజస్థాన్ రాయల్స్ జట్లపై రెండేళ్ల పాటు నిషేధం విధించిన నేపథ్యంలో వచ్చే ఐపీఎల్ సీజన్ లో ధోనీ కనిపించడని మొన్నటిదాకా ప్రచారం సాగింది. అయితే ఈ ప్రచారంలో ఎంతమాత్రం నిజం లేదని క్రికెట్ పండితులు చెబుతున్నారు. టీమిండియా వన్డే, టీ20 జట్ల నాయకుడిగానే కాక ప్రపంచంలోనే విజయవంతమైన కెప్టెన్ గా ఖ్యాతిగాంచిన ధోనీ, ఐపీఎల్ లాంటి కీలక టోర్నీలకు దూరంగా ఎలా ఉంటాడని కూడా వారు ప్రశ్నిస్తున్నారు. చెన్నై సూపర్ కింగ్స్ తో పాటు రాజస్థాన్ రాయల్స్ జట్ల స్థానంలో మరో రెండు కొత్త జట్లు ఐపీఎల్-9లో తెరంగేట్రం చేయనున్నాయి. వీటిలో దేనికో ఒకదానికి ధోనీ తప్పనిసరిగా ఆడతాడని వారు పేర్కొంటున్నారు. ఐపీఎల్ ప్రారంభం నుంచి మొన్నటి ఐపీఎల్-8 సీజన్ దాకా తన జట్టుకే ఆడిన అతడు వేరే జట్టుకు ఆడే విషయంలో చెన్నై సూపర్ కింగ్స్ అంతగా పట్టించుకునే అవకాశాలు లేవని తెలుస్తోంది. ఈ విషయంలో ధోనీని నిలువరించే పనిని సూపర్ కింగ్స్ యాజమాన్యం చేయబోదని కూడా విశ్లేషకులు చెబుతున్నారు. దీంతో కొత్తగా రంగప్రవేశం చేయబోయే జట్లు రెండూ ధోనీ కోసం పోటాపోటీ రేట్లను ప్రకటించే అవకాశాలూ లేకపోలేదట. దీంతో ఐపీఎల్-9 సీజన్ ఎల్లో జెర్సీ కాకుండా వేరే జెర్సీతో బరిలోకి దిగనున్న ధోనీకి ఈ సారి కూడా భారీ రేటే అందడం ఖాయమే.