: దసరాను ‘మస్త్’గా ఎంజాయ్ చేసిన హైదరాబాదీలు...4 రోజుల్లో రూ.100 కోట్ల మద్యం తాగేశారట!
దసరా సెలవులను హైదరాబాదీలు ‘మందు’తో మస్త్ మజా చేశారు. ప్రధానంగా మద్యపానం అలవాటు ఉన్న నగర జీవులు నాలుగు రోజుల్లోనే ఏకంగా రూ.100 కోట్ల విలువ చేసే మద్యాన్ని తమ బొజ్జల్లో నింపేసుకున్నారట. ఈ మేరకు తెలంగాణ ఆబ్కారీ శాఖ విడుదల చేసిన గణాంకాలు చెబుతున్నాయి. సాధారణంగా గ్రేటర్ హైదరాబాదు పరిధిలో రోజూ రూ.10 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరుగుతాయి. గ్రేటర్ పరిధిలోని 460 మద్యం దుకాణాలు, 500 బార్లలో దాదాపు నిత్యం సందడి వాతావరణం కనిపిస్తుంది. అయితే దసరా సెలవులను పురస్కరించుకుని సోమ, మంగళ, బుధ, గురువారాల మద్యం అమ్మకాలు రూ.100 కోట్ల మార్కును తాకాయి. అంటే, ఈ నాలుగు రోజుల్లో రోజుకు రూ.25 కోట్ల మద్యం విక్రయమైపోయిందన్న మాట. గతేడాది దసరా సందర్భంగా రూ.75 కోట్ల మద్యం విక్రయం కాగా, ఈ ఏడాది ఈ అమ్మకాలు మరింత పెరిగాయని ఆబ్కారీ శాఖ అధికారులు నిన్న వెల్లడించారు.