: శ్రీని ఇంట ధోనీ... చెన్నై భేటీపై విమర్శల జడివాన
వివాదాస్పద నిర్ణయాలతో క్రికెట్ క్రీడకు దూరమవుతున్న బీసీసీఐ మాజీ చీఫ్ ఎన్.శ్రీనివాసన్ ఇంటిలో నిన్న టీమిండియా వన్డే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అడుగుపెట్టాడు. అల్పాహారం తీసుకున్నాడు. మాజీ బాస్ తో దాదాపు 45 నిమిషాలకు పైగా సమాలోచనలు చేశాడు. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోతూ ఈ భేటీ వ్యక్తిగతమంటూ మీడియాకు ముఖం చాటేసి వెళ్లిపోయాడు. ఫ్రీడమ్ సిరీస్ లో భాగంగా విజయదశమి నాడు దక్షిణాఫ్రికాతో వన్డే కోసం చెన్నైకి వచ్చిన ధోనీ మ్యాచ్ ముగిసిన మరునాడు (శుక్రవారం) ఉదయం శ్రీని ఇంటికెళ్లాడు. ఈ భేటీపై క్రికెట్ వర్గాలు విస్మయం వ్యక్తం చేశాయి. పలు వివాదాల్లో చిక్కుకుని వివాదాస్పదుడిగా ముద్రపడ్డ శ్రీని ఇంటికి భారత క్రికెట్ కు నాయకుడి హోదాలో ఉన్న ధోనీ వెళ్లడం సరికాదంటూ ఆ వర్గాలు ఆక్షేపించాయి. ఈ తరహా భేటీలు తప్పుడు సంకేతాలిస్తాయని చెప్పిన బీహార్ క్రికెట్ సంఘం కార్యదర్శి ఆదిత్మ వర్మ కెప్టెన్ కూల్ కు ఏకంగా లేఖ కూడా రాశారు. ఇలాంటి పనులు పునరావృతం కాకుండా చూడాలంటూ ఆయన ధోనీకి సూచనలు చేశారు.