: మందేసి మూడు ముళ్లు వేసిన వరుడు... వాసన పసిగట్టి ఛీకొట్టిన వధువు
సాయంత్రానికి పెళ్లి... సంబరాల్లో మునిగిపోయిన మిత్రులతో కలిసి వరుడు మధ్యాహ్నం దాకా ఫుల్లుగా మందేశాడు. పెగ్గు మీద పెగ్గులు... అలా గంటల తరబడి ఆ వరుడు మందేస్తూనే ఉన్నాడు. తీరా పెళ్లి గడియలు రానే వచ్చాయి. అప్పటికింకా అతడి నుంచి మందు వాసన వస్తూనే ఉంది. అయితే, చక్కగా స్నానం చేసి పెళ్లి బట్టలు కట్టుకుని, ఒళ్లంతా సెంటు కొట్టుకుని అతడు పెళ్లి పీటలు ఎక్కాడు. అందరినీ బోల్తా కొట్టించాడు. పెళ్లి కూతురు మెడలో తాళి కూడా కట్టేశాడు. అయితే తాళి కడుతున్న సమయంలో అతడి నుంచి వస్తున్న ‘మందు’ కంపును పసిగట్టిన వధువు, షాక్ తింది. మందుబాబుతో కలిసి ఏడడుగులు నడవడమే కాదు కదా, జీవితం కూడా పంచుకోలేనని తేల్చిచెప్పింది. దీంతో అప్పటికీ ఇంకా నిషాలోనే ఉన్న వరుడు మెడలో ఉన్న దండలు తీసేసి ఆమెతో మండపంలోనే వాగ్వాదానికి దిగాడు. వరుడి ‘మందు’ మాటలతో చిర్రెత్తుకొచ్చిన వధువు తన తల్లితో కలిసి నేరుగా ఎస్పీ కార్యాలయానికి వెళ్లి ఫిర్యాదు చేసింది. తమిళనాడులోని తేని జిల్లా బోడినాయకనల్లూరు సమీపంలోని వీరపాండిలో సోమవారం ఈ ఘటన జరిగింది. పుదూర్ కు చెందిన సౌందర్య అనే యువతి, మందు కొట్టి తన మెడలో తాళి కట్టిన సెల్వ పాండియన్ తో పెళ్లి రద్దు చేసుకుని వెళ్లిపోయింది.