: ‘దేవాస్’తో శాస్త్రవేత్తలకూ చిక్కులు...ఇస్రో మాజీ చైర్మన్ రాధాకృష్ణన్ ను ప్రశ్నించిన సీబీఐ
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)లో శాస్త్రవేత్తలంతా నిత్యం ప్రయోగాల్లో మునిగి తేలుతుంటారు. ఉపగ్రహాల ప్రయోగ సమయాల్లో మాత్రమే వారు మీడియాకు కనిపిస్తారు. అయితే అరచేతిలో ఇమిడే శాటిలైట్ ఆధారిత మల్టీ మీడియా సర్వీసులకు సంబంధించిన స్పెక్ట్రమ్ ను వాడుకునే విషయంలో ప్రైవేట్ సంస్థ ‘దేవాస్’తో ఇస్రో అనుబంధ సంస్థ యాంత్రిక్స్ చేసుకున్న ఒప్పందం శాస్త్రవేత్తలను రోడ్డెక్కించింది. వివాదాస్పదంగా మారిన ఈ ఒప్పందం ఆ తర్వాత రద్దయినా, నాడు సంస్థ అధిపతిగా కొనసాగిన రాధాకృష్ణన్ ఇప్పటికీ ఇబ్బందులు పడుతున్నారు. దేశంలోనే పెను వివాదం రేపిన ఈ ఒప్పందాన్ని రద్దు చేసుకున్న దరిమిలా అంతర్జాతీయ మధ్యవర్తిత్వ సంస్థ తీర్పు ప్రకారం ఇస్రో రూ.4,400 కోట్ల జరిమానా చెల్లించాల్సి వచ్చింది. దీంతో ఈ వ్యవహారంపై కేంద్రం ఆదేశాలతో దర్యాప్తు ప్రారంభించిన సీబీఐ కేసు నమోదు చేసింది. దర్యాప్తులో భాగంగా నిన్న సీబీఐ అధికారులు రాధాకృష్ణన్ ను విచారించారు. ఒప్పందం కుదరడం, రద్దు కావడం రెండూ రాధాకృష్ణన్ చైర్మన్ గా ఉన్న సమయంలోనే జరిగాయి. ఈ నేపథ్యంలో నిన్న బెంగళూరులోని యాంత్రిక్స్ కార్యాలయానికి రాధాకృష్ణన్ ను పిలిచిన సీబీఐ అధికారులు ఆయనను దాదాపు రెండు గంటల పాటు వివిధ కోణాల్లో విచారించారు.