: లంచాలు తీసుకుని తాడిపత్రిని అభివృద్ధి చేస్తా: జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్య
జేసీ బ్రదర్స్ ఏం మాట్లాడినా సంచలనమే. అన్న జేసీ దివాకర్ రెడ్డి ఆది నుంచి రాజకీయాల్లో ఉంటూ తనదైన శైలిలో వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. కాస్త ఆలస్యంగా రాజకీయ తెరంగేట్రం చేసిన ఆయన సోదరుడు జేసీ ప్రభాకర్ రెడ్డి కూడా తన అన్న మాదిరిగానే సంచలన వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రెస్ గా మారారు. నిన్న మీడియాతో మాట్లాడిన సందర్భంగా ఆయన ఆసక్తికర కామెంట్లు చేశారు. ఇకపై తాను కూడా లంచాలు తీసుకుంటానని, వాటితోనే తన నియోజకవర్గాన్ని (తాడిపత్రి) అభివృద్ధి చేస్తానని ఆయన ప్రకటించారు. ‘‘దేశంలో ప్రభుత్వం వద్ద డబ్బులు లేవు. నా నియోజకవర్గంలో రూ.30 లక్షలు పెట్టి కల్యాణమండపం కడుతున్నా. నాకు డబ్బులు ఎవరు ఇస్తున్నారు? చాలా మంది కాంట్రాక్టర్లు పర్సంటేజీలు ఇస్తామంటే నేను తీసుకోవట్లేదు. ఇక నుంచి లంచాలు తీసుకోవడం నేనే మొదలుపెడతా. లంచం తీసుకునే తాడిపత్రిని అభివృద్ది చేస్తా. లంచాలను డీడీల రూపంలో తీసుకుని ఏం ఖర్చు పెట్టానో రాస్తా’’ అని జేసీ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి.