: చార్జీల పెంపు పేదలపై భారం కాబోదు: ఆర్టీసీ ఎండీ సాంబశివరావు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సుల్లో పెరిగిన ఛార్జీలపై ఆందోళన చెందాల్సిన పని లేదని ఆర్టీసీ ఎండీ సాంబశివరావు తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, ఏపీఎస్ ఆర్టీసీలో మెరుగైన సేవల నిర్వహణకు చార్జీలు పెంచకతప్పదని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రి సిద్ధా రాఘవరావుకు ప్రతిపాదనలు పంపామని అన్నారు. దీనికి ముఖ్యమంత్రి, మంత్రి అంగీకరించలేదని, పెంచిన చార్జీల వివరాలు తెలపాలని అడిగారని, తాము 15 నుంచి 20 శాతం ఛార్జీలు పెంచాలని ప్రతిపాదనలు పెట్టామని, వాటిని చూసిన సీఎం పలు సూచనలు చేశారని అన్నారు. ఆ సూచనల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులలో తిరుగుతున్న పది లక్షల మంది విద్యార్థులపై ఛార్జీల భారం వేయలేదని అన్నారు. రెండో షరతుగా సర్వీసులన్నీ ఒకేలా చూడొద్దని ముఖ్యమంత్రి వ్హేప్పారని, పల్లె వెలుగు, తెలుగు వెలుగు బస్సుల్లో కేవలం 5 శాతం ఛార్జీల పెంపుకే అంగీకరించారని ఆయన తెలిపారు. పల్లె వెలుగు, తెలుగు వెలుగు సర్వీసుల్లో 5 శాతం మాత్రమే ధరలు పెరిగాయని, అంటే కిలో మీటర్ కు 5 పైసలు పెంచామని ఆయన చెప్పారు. దీంతో కిలో మీటర్ పై ఇప్పటి వరకు 59 పైసలు వసూలు చేస్తుండగా, ఇకపై కిలో మీటర్ కు 62 పైసలు వసూలు చేస్తామని ఆయన చెప్పారు. మెరుగైన సేవలు అందించేందుకు ఆర్టీసీ సంస్థ, ఉద్యోగులు కష్టపడుతున్నారని, అయినా నష్టాల్లో ఉన్నామని తెలిపారు. దీంతో ఎక్స్ ప్రెస్ పై పది శాతం, లగ్జరీ, వెన్నెల బస్సు ఛార్జీలపై 15 నుంచి 20 శాతం పెంచామని ఆయన చెప్పారు.