: ఏనుగులకు దండం పెట్టి బతికిపోయాడు!
ఏనుగులకు చిర్రెత్తుకొస్తే దేనినైనా నాశనం చేస్తాయి. మనుషుల్ని తొండంతో ఎత్తి నేలకేసి కొడతాయి. అలాంటి ఏనుగుల గుంపుకు రెండు చేతులూ జోడించి దండం పెట్టి తప్పించుకున్నాడు ఓ వ్యక్తి. థాయ్ లాండ్ లో ఈ ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకుంది. థాయ్ లాండ్ లో 2 వేల ఎకరాల్లో విస్తరించి ఉన్న ఖావో యై నేషనల్ పార్కులో వందల సంఖ్యలో జంతువులు ఆశ్రయం పొందుతున్నాయి. వీటి సందర్శనార్థం వాహనాలను కూడా పార్కులోనికి అనుమతిస్తారు. అలా ఓ ద్విచక్రవాహనంపై ఓ సందర్శకుడు వెళ్తుండగా ఆగ్రహంతో ఏనుగుల గుంపు మీదకు దూసుకువచ్చింది. దీంతో ఆ సందర్శకుడు అప్రమత్తమై బైక్ దిగి ఏనుగులకు భక్తితో నమస్కరించాడు. దాంతో, ఆగ్రహంతో వచ్చిన ఏనుగుల గుంపు అతనిని ఏమీ చేయకుండా వెళ్లిపోయింది. ఇంతకీ ఏనుగుల ఆగ్రహానికి కారణం ఏంటంటే, అంతకుముందు అటుగా ద్విచక్రవాహనాలపై వచ్చిన ఆకతాయిలు పెద్ద పెద్ద శబ్దాలతో ఏనుగులను చికాకుపెట్టారు. దీంతో వాటికి చిర్రెత్తుకొచ్చింది. ఈ సన్నివేశాలన్నీ వెనుక వస్తున్న ఓ కారులోని సీసీ టీవీలో రికార్డు కావడంతో, ఈ పుటేజ్ ను సోషల్ మీడియాలో పెట్టారు. దీనికి నెటిజన్ల నుంచి విశేషమైన ఆదరణ లభిస్తోంది.