: ప్రజల ఆశలపై గుప్పెడు మట్టి, చెంబుడు నీళ్లు చల్లిన మోదీ... వైసీపీ నేత అంబటి విమర్శ
ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటిస్తారని గంపెడాశలు పెట్టుకున్న రాష్ట్ర ప్రజలపై ప్రధాని నరేంద్ర మోదీ గుప్పెడు మట్టి, చెంబుడు నీళ్లు చల్లి ఢిల్లీ వెళ్లిపోయారని వైసీపీ కీలక నేత అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. రాజధాని శంకుస్థాపన కార్యక్రమం మొత్తం తమ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పినట్లుగానే జరిగిందని కూడా ఆయన వ్యాఖ్యానించారు. హైదరాబాదులోని లోటస్ పాండ్ లో కొద్దిసేపటి క్రితం విలేకరులతో మాట్లాడిన అంబటి, శంకుస్థాపన కార్యక్రమం జరిగిన తీరుపై విమర్శలు గుప్పించారు. నరేంద్ర మోదీ-చంద్రబాబు ధ్వయం ఏపీ ప్రజలను నిండా ముంచేసిందని ఆయన ఆరోపించారు. కేసుల నుంచి బయటపడేందుకు చంద్రబాబు ఏపీ ప్రయోజనాలను కేంద్రం వద్ద తాకట్టు పెట్టారన్నారు. చంద్రబాబు చెప్పినట్లు నిన్న తెలుగు ప్రజలకు రెండు పండుగలు కాదని చెప్పిన ఆయన, రెండు వంచనలు ఎదురయ్యాయన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా వచ్చే దాకా తాము పోరాటం చేస్తామని అంబటి ప్రకటించారు.