: యువతిని కాపాడి మాయమైన వ్యక్తి... వెతికి పట్టుకుని మరీ పార్టీ ఇచ్చింది!
రాత్రి పూట ఒంటరిగా బస్సులో ప్రయాణిస్తున్న ఓ యువతిని చూసిన ఆకతాయి వేధించడం ప్రారంభించాడు. పక్కనే ఉన్న వ్యక్తి అతన్ని వారించి క్లాస్ పీకాడు. దీంతో ఆ జులాయి వెనక్కు తగ్గగా, తేరుకున్న ఆ యువతి తనను కాపాడిన వ్యక్తి గురించి చూడగా అతను కనిపించలేదు. అతన్ని ఎలాగైనా కలుసుకోవాలని సామాజిక మాధ్యమాలను ఆశ్రయించింది. అతన్ని పట్టుకుని బీరు పార్టీ ఇవ్వడమే కాకుండా, తనను రక్షించినందుకు కృతజ్ఞతలు చెప్పింది. మరిన్ని వివరాల్లోకి వెళితే... లండన్ కాలేజీలో పీహెచ్ డీ చేస్తూ, ఓ టీవీ ప్రోగ్రామర్ గా పనిచేస్తున్న కత్లిన్ రెగర్ అనే యువతి గత వారం ఓ బస్సు ఎక్కింది. బస్సులో రద్దీ లేకపోవడంతో, ఓ యువకుడు ఆమెను దగ్గరకు లాక్కొని అసభ్యంగా ప్రవర్తించాడు. అదే బస్సులో ఉన్న మరో వ్యక్తి, అతనిని తిట్టి కట్టడి చేశాడు. అంతలో తన గమ్యం రావడంతో అతను దిగిపోయాడు. అతన్ని కలుసుకోవాలని భావించిన కెత్లిన్ 'మంచి రక్షకుడు' అని టైటిల్ పెట్టి జరిగినదంతా ఫేస్ బుక్ లో పంచుకుంది. ఎర్రగా ఉన్నాడని, గడ్డం మీసాలను అందంగా ట్రిమ్ చేసుకున్నాడని చెబుతూ, అతన్ని వెతకడంలో సహకరించాలని కోరింది. ఆమె పోస్టును 86 వేల మంది షేర్ చేసుకున్నారు. వారం రోజుల్లో అతనెవరో తెలిసిపోయింది. ఫిరాత్ ఓజ్ సెలిక్ అనే వ్యక్తి ఆమెను కాపాడాడని నెటిజన్లు పట్టేశారు. అతడిని కత్లిన్ కు కలిపారు. ఆమె ఆనందంతో అతడికి పార్టీ ఇచ్చింది. కృతజ్ఞతలు తెలిపింది. ఫిరాత్ చేసిన పనికి ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.