: ఏపీకి న్యాయం చేసే అంశం నిరంతర ప్రక్రియ... వెంకయ్యనాయుడు ప్రకటన
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సాయం చేసే అంశాన్ని నిరంతర ప్రక్రియగా భావిస్తున్నామని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. రాష్ట్ర విభజన తర్వాత రాజధాని కూడా లేకుండా తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో అవస్థలు పడుతున్న ఆ రాష్ట్రాన్ని ఆదుకునేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని కూడా ఆయన ప్రకటించారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండల పరిధిలోని ముచ్చింతలలో స్వర్ణ భారతి ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా వెంకయ్య ఈ మేరకు వ్యాఖ్యానించారు. రెండు తెలుగు రాష్ట్రాలకు సాయం చేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు తాము సిద్ధంగానే ఉన్నామని చెప్పిన వెంకయ్య, అందుకోసం కొంత సమయం పడుతుందని చెప్పారు. దీనిని అలుసుగా తీసుకుని చౌకబారు విమర్శలు చేయడం సరికాదని ఆయన ప్రతిపక్షాలకు సూచించారు.