: ఐఎస్ఐఎస్ పై దాడికి వెళ్లి మరణించిన అమెరికన్ సైనికుడు... నాలుగేళ్లలో తొలిసారి!


ఇరాక్ లో ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల చెరలో ఉన్న సామాన్యులను విడిపించేందుకు వెళ్లిన అమెరికన్ బృందంలో ఓ సైనికుడు వీరమరణం పొందాడు. గత నాలుగేళ్లలో ఇరాక్ లో దాడుల కారణంగా మరణించిన అమెరికన్ సైనికుడు ఇతనే కావడం గమనార్హం. గురువారం నాడు ఇరాక్ ఉత్తర ప్రాంతంలోని హవీజా పట్టణంపై కుర్దిష్, యూఎస్ కమాండోల బృందం సంయుక్తంగా దాడులు జరిపిందని, ఈ యుద్ధం అనంతరం 70 మంది ఖైదీలను విడిపించామని, ఐదుగురు ఐఎస్ఐఎస్ ఫైటర్లను అదుపులోకి తీసుకున్నామని పెంటగాన్ అధికారి ఒకరు తెలిపారు. గత సంవత్సరం ఇరాక్ నుంచి సైన్యాన్ని వెనక్కు తీసుకున్న అమెరికా, స్థానిక సైనికులకు సాయం అందించేందుకు దాదాపు 3,500 మందిని విధుల్లోనే ఉంచిన సంగతి తెలిసిందే. ప్రజల ప్రాణాలను కాపాడేందుకు పాటుపడుతున్న కుర్దిష్ ప్రభుత్వానికి సహాయం చేసేందుకు తాము కొంత సైన్యాన్ని అక్కడే ఉంచామని పెంటగాన్ ప్రెస్ సెక్రటరీ పీటర్ కుక్ వ్యాఖ్యానించారు. హవీజాకు బయలుదేరిన కుర్దూ సైన్యం అమెరికన్ హెలికాప్టర్లను వాడుకుందని, ఈ విషయాన్ని ముందుగానే అధ్యక్ష కార్యాలయానికి తెలియజేశామని, వారికి మద్దతుగా యూఎస్ స్పెషల్ ఆపరేషన్స్ ఫోర్సులు కలిశాయని వివరించారు. మొత్తం ఐదు హెలికాప్టర్లు రైడింగ్ కు వెళ్లాయని, వీటిల్లో చినూక్, బ్లాక్ హాక్ చాపర్లున్నాయని వివరించారు. యూఎస్ సైనికుడి మృతి దురదృష్టకరమని వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News