: గిరాకీ లేక ఉసూరుమంటున్న హైదరాబాద్ హోటళ్లు... కారణమిదే!
అమరావతి దెబ్బకు హైదరాబాద్ ఆతిథ్య రంగం కుదేలైంది. తమ వ్యాపారం తగ్గిపోయిందని, బిజినెస్ అంతా విజయవాడ వైపునకు వెళ్లిపోతోందని హోటళ్ల యజమానులు చెబుతున్నారు. టూరిజం పరంగా, గత సంవత్సరం వరకూ హైదరాబాద్ కు ఉన్న డిమాండ్, ఇప్పుడు కొత్త రాజధాని వైపు వెళ్లిపోయిందని, అక్కడి హోటళ్లలో వ్యాపారం రెండింతలు కాగా, ఆ మేరకు హైదరాబాద్ హోటళ్లకు నష్టం వస్తోందని తెలంగాణ స్టేట్ హోటల్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి జగదీశ్ రావు తెలిపారు. సమీప భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ పాలన కూడా అమరావతి కేంద్రంగా సాగనుండటంతో, వివిధ పనుల నిమిత్తం వచ్చేవారు అక్కడికే వెళుతారని, దీంతో హైదరాబాద్ లో చిన్న, మధ్య తరహా హోటళ్లలో వ్యాపారం గణనీయంగా తగ్గనుందని అభిప్రాయపడ్డారు. కాగా, హైదరాబాద్ కు వివిధ పనుల నిమిత్తం వచ్చే వారంతా లక్డీకపూల్, ఖైరతాబాద్, నాంపల్లి, కోటి ప్రాంతాల్లోని హోటళ్లలో బస చేస్తారన్న సంగతి తెలిసిందే. లక్డీకపూల్లోని ద్వారక, కృష్ణా గ్రూప్ హోటళ్లతో పాటు హోటల్ అశోక తదితరాల్లో సీమాంధ్ర, రాయలసీమ నుంచి హైదరాబాద్ వచ్చే వారు బస చేస్తుంటారు. ఇప్పుడీ హోటళ్లకు వచ్చే వారి సంఖ్య భారీగా తగ్గింది. ఇక ఏపీకి చెందిన అన్ని కార్యాలయాలూ విజయవాడ పరిసరాలకు వెళితే, ఇక్కడికి వచ్చే వారు ఎవరూ ఉండరని, దీంతో తాము తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని హోటళ్ల యజమానుల సంఘం భయపడుతోంది.