: బార్ లో బ్రిటన్ ప్రధాని, చైనా అధ్యక్షుడు... మందేసి సేద దీరిన వైనం
బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరూన్, చైనా అద్యక్షుడు జీ జిన్ పింగ్... ప్రపంచంలోని రెండు అగ్రరాజ్యాలకు అధిపతులు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కలిగిన రెండు కీలక దేశాలకు వారు పాలకులు. అయితేనేం, ఎంచక్కా మందీ మార్బలాన్ని పక్కన పెట్టేసి నేరుగా మధుశాల (బార్)లోకి ఎంట్రీ ఇచ్చారు. స్వయంగా డబ్బులిచ్చి మందు కొన్నారు. పక్కపక్కనే కూర్చుని గొంతులోకి ఒంపుకున్నారు. ఆ తర్వాత చేపలు, చిప్స్ ను నంజుకుంటూ ఎంజాయ్ చేశారు. నిజమా? వారికి బార్ కెళ్లేంత సమయం ఎక్కడిది? అయినా, వారు తలచుకుంటే బారే వారి ముంగిట వాలిపోతుంది కదా? వారెందుకు బార్ కెళ్లారు? అనేగా మీ డౌట్లు. ఆ డౌట్ల సంగతేమో కానీ, తాము మాత్రం నేరుగా బార్ కెళ్లి మందు, పసందైన స్నాక్స్ తో ఎంజాయ్ చేశామని సాక్షాత్తు బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరూన్ ట్విట్టర్ లో ఓ ఆసక్తికరమైన పోస్ట్ పెట్టారు. వివరాల్లోకెళితే... బ్రిటన్ పర్యటనలో భాగంగా నిన్న చైనా ప్రధాని జీ జిన్ పింగ్ బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరూన్ ను కలిశారు. ఆ తర్వాత వారిద్దరూ క్యాడ్సన్ లోని ఓ బార్ కు వెళ్లారు. స్వయంగా డబ్బులు చెల్లించి మూడు క్వార్టర్ల బ్రిటన్ సంప్రదాయ మత్తుపానీయం ‘ట్రెడిషనల్ ఇంగ్లిష్ బిట్టర్’ను కొనుగోలు చేశారు. ఆ తర్వాత బ్రిటన్ లో ఫేమస్ స్నాక్స్ స్పెషల్ చేపలు, చిప్స్ ను కూడా కొన్నారు. పక్కపక్కనే కూర్చుని మందు సిప్ చేస్తూ చేపలను లొట్టేసుకుంటూ తిన్నారు. ఇక వారిద్దరినీ చూసి ఆ బార్ లోని మందుబాబులు ఆశ్చర్యం వ్యక్తం చేయగా, బార్ యజమాని మాత్రం సంతోషం వ్యక్తం చేశాడట.