: అమరావతి శంకుస్థాపనను చంద్రబాబు కుటుంబ కార్యంలా జరిపారు: నిప్పులు చెరిగిన జేడీ శీలం
విజయదశమి సందర్భంగా అంగరంగ వైభవంగా జరిగిన నవ్యాంధ్ర రాజధాని అమరావతి శంకుస్థాపన తీరుపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జేడీ శీలం ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర వేడుకలా జరగాల్సిన ఈ కార్యక్రమం ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడి కుటుంబ కార్యంలా జరిగిపోయిందని ఆయన ధ్వజమెత్తారు. నేటి ఉదయం ఓ టీవీ చానెల్ నిర్వహించిన చర్చాగోష్టిలో పాల్గొన్న సందర్భంగా జేడీ శీలం పలు అంశాలను ప్రస్తావించారు. ప్రతి అధికారిక కార్యక్రమానికి సొంత కార్యంలా కలరింగ్ ఇవ్వడం టీడీపీకి కొత్త కానప్పటికీ, అత్యంత ముఖ్యమైన రాజధాని శంకుస్థాపనకు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీని ఎందుకు పిలవలేదని నిలదీశారు. పార్లమెంటు ప్రాంగణం నుంచి మట్టిని తీసుకువచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, పార్లమెంటులో చేసిన హామీల అమలును మాత్రం పూర్తిగా విస్మరించారని ఆయన ఆరోపించారు.