: డివిలియర్స్, డుప్లెసిస్, మిల్లర్, బెహర్దిన్ ను ముప్పుతిప్పలు పెడుతున్న భజ్జీ, అక్సర్
300 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన సౌతాఫ్రికా ఆటగాళ్లు డివిలియర్స్, డుప్లెసిస్, మిల్లర్, బెహర్దిన్ లను టీమిండియా స్పిన్నర్లు హర్భజన్ సింగ్, అక్సర్ పటేల్ లు ముప్పుతిప్పలు పెట్టారు. వారి బౌలింగ్ దాడికి భారీ షాట్లు ఎలా ఆడాలో తెలియక అత్యంత వేగంగా పరుగులు చేసే ఆటగాళ్లుగా పేరున్న వీరంతా తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ఇన్నింగ్స్ ఆరంభంలో పేస్ బౌలర్లను ఉతికి ఆరేయడంతో కేవలం 7.4 ఓవర్లలో అర్ధ సెంచరీ పూర్తి చేసిన సౌతాఫ్రికా జట్టు, సెంచరీ మార్కును చేరేందుకు మాత్రం 22 ఓవర్లు తీసుకుంది. భారత ఆటగాళ్ల అసమర్థత వల్ల డివిలియర్స్ ఐదు సార్లు అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకోగలిగాడు. దీంతో డికాక్ (43), ఆమ్లా (7), డుప్లెసిస్ (17) , మిల్లర్ (6) పెవిలియన్ చేరగా, క్రీజులో డివిలియర్స్ (18), బెహర్దిన్ (11) ఆడుతున్నారు. దీంతో 24 ఓవర్లలో సౌతాఫ్రికా జట్టు నాలుగు వికెట్ల నష్టానికి 117 పరుగులు చేసింది. భారత బౌలర్లలో హర్భజన్ సింగ్ రెండు వికెట్లు తీయగా, మోహిత్ శర్మ, అక్సర్ పటేల్ చెరో వికెట్ తీసి అతనికి చక్కని సహకారమందించారు.