: తెలంగాణ, ఏపీ వేరైనా... తెలుగు ఆత్మ ఒక్కటే!: ప్రధాని మోదీ
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వేర్వేరు ప్రాంతాలైనా, రెండు రాష్ట్రాలకు చెందిన వారిలోని తెలుగు ఆత్మ ఒక్కటేనని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. అదే పంథాలో ముందుకెళ్లాలని ఆయన రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు పిలుపునిచ్చారు. నవ్యాంధ్ర రాజధాని అమరావతి శంకుస్థాపన అనంతరం ఏర్పాటైన వేదికపై నుంచి ఆయన ప్రసంగిస్తూ ఇరు రాష్ట్రాల మధ్య తలెత్తిన విభేదాలను ప్రస్తావించారు. రాష్ట్ర విభజనకు ముందు, ఆ తర్వాత ఇరు రాష్ట్రాల్లో పలువురు చనిపోవడం, పలు హింసాత్మక ఘటనలు చోటుచేసుకోవడం తనను కలచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాంతాలు వేరైనా, భాషాపరంగా రెండు రాష్ట్రాల ప్రజలు ఒక్కటేనని ఆయన పేర్కొన్నారు. అమరావతి రాజధాని శంకుస్థాపనకు తెలంగాణ సీఎం కేసీఆర్ ను ఆహ్వానించేందుకు తానే స్వయంగా వెళ్లానని చంద్రబాబు చెప్పినపుడు తాను చాలా సంతోషించానన్నారు. ఇరు రాష్ట్రాల ప్రజలు విద్వేషాలను పక్కనబెట్టి కలిసికట్టుగా ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు. రెండు తెలుగు రాష్ట్రాలకు అవసరమైన సహాయ సహకారాలను అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఆయన హామీ ఇచ్చారు. రాష్ట్ర విభజన సందర్భంగా యూపీఏ ప్రభుత్వం ఏఏ హామీలు ఇచ్చిందో వాటన్నింటినీ తాము అమలు చేస్తామని మోదీ పేర్కొన్నారు.