: అమరావతి శంకుస్థాపనకు డుమ్మా కొట్టిన పవన్ కల్యాణ్...గుజరాత్ లో బిజీబిజీగా షూటింగ్
జనసేన అధినేత, టాలీవుడ్ ప్రముఖ నటుడు పవన్ కల్యాణ్ నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి శంకుస్థాపనకు డుమ్మా కొట్టేశారు. శంకుస్థాపన కార్యక్రమానికి తప్పనిసరిగా హాజరుకావాలని సాక్షాత్తు ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు స్వయంగా ఫోన్ చేసి మరీ పవన్ ను ఆహ్వానించారు. ఆ తర్వాత ఏపీ మంత్రులు కామినేని శ్రీనివాస్, అయ్యన్నపాత్రుడు, ఎమ్మెల్సీ టీడీ జనార్దన్ లు షూటింగ్ స్పాట్ కు వచ్చి మరీ ఆయనను ఆహ్వానించారు. ఆహ్వానం అందుకున్న మరుక్షణమే మీడియాతో మాట్లాడుతూ తాను శంకుస్థాపనకు వస్తానో, రానోనన్న కోణంలో పవన్ వ్యాఖ్యానించారు. అయితే కార్యక్రమానికి తప్పనిసరిగా హాజరు కావాల్సిందేనని మంత్రులు ఆయనను కోరారు. శంకుస్థాపనకు రావాలని తనకూ ఉందని, అయితే షూటింగ్ షెడ్యూల్ అందుకు అనుమతించాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. దీంతో ఈ కార్యక్రమానికి పవన్ కల్యాణ్ హాజరుపై అయోమయం నెలకొంది. కొంతమంది అనుమానించినట్లుగానే నేటి కార్యక్రమానికి పవన్ డుమ్మా కొట్టేశారు. ప్రస్తుతం గుజరాత్ లో జరుగుతున్న తన తాజా చిత్రం ‘సర్దార్ గబ్బర్ సింగ్’ షూటింగ్ లో ఆయన తలమునకలై ఉన్నారు. దీంతో ఆయన ఇక శంకుస్థాపనకు రారనే దాదాపుగా తేలిపోయింది.