: రైతులకు రెడ్ కార్పెట్ స్వాగతం... పట్టు వస్త్రాలు ధరించి ‘వేడుక’కు తరలివస్తున్న రైతులు
నవ్యాంధ్ర రాజధాని నిర్మాణం కోసం స్వచ్ఛందంగా భూములిచ్చిన రైతులకు అమరావతి శంకుస్థాపన వేడుకకు రెడ్ కార్పెట్ స్వాగతం లభిస్తోంది. ఇప్పటికే 25 వేల మందికి పైగా రైతుల వద్దకు వెళ్లిన ప్రభుత్వ ప్రతినిధులు రైతులకు పేరు పేరునా ఆహ్వానాలు అందించారు. పట్టు వస్త్రాలు, తాపేశ్వరం స్వీట్ బాక్సులు పెట్టిన సంచులతో పాటు ఆహ్వాన పత్రికలను రైతులు అందుకున్నారు. ఇక నేటి మధ్యాహ్నం జరగనున్న శంకుస్థాపనను ప్రత్యక్షంగా వీక్షించేందుకు రైతులు ఉద్ధండరాయునిపాలెం చేరుకుంటున్నారు. ప్రభుత్వం అందించిన పట్టు వస్త్రాలను ధరించిన రైతులు ఉత్సాహంగా వేడుకకు తరలివస్తున్నారు. వీరికి ప్రభుత్వం నియమించిన ప్రతినిధులు సాదరంగా స్వాగతం పలుకుతున్నారు.