: ఈ వందేళ్ల బామ్మగారికి బద్ధకమంటే తెలియదు!
వందేళ్ల వయస్సులో కూడా ఆమె చలాకీగా ఉంటుంది. బద్ధకమంటే ఏమిటో ఆమెకు తెలియదు. ఆమె ప్రతిరోజూ ఎన్ని గంటలు పనిచేస్తుందో తెలిస్తే 'బామ్మా... మజాకా' అనక తప్పదు. ఈ శతాధిక వృద్ధురాలు రోజుకు 11 గంటలు పనిచేస్తుంది. ఈ బామ్మ పేరు ఫెలిమినా రొటుండో. బఫాలోని ఒక కళాశాల లాండ్రీ షాపులో పనిచేస్తుంది. బట్టలు ఉతకడం, డ్రైక్లీనింగ్ చేయడం వంటి పనులు చాలా సునాయాసంగా చేస్తుంది. ఉదయం ఏడు గంటలకు పని ప్రారంభించి, సాయంత్రం ఆరు గంటలకు బామ్మ పని ముగిస్తుంది. తనకు పదిహేనేళ్ల వయస్సు ఉన్నప్పటి నుంచి ఉద్యోగం చేయడం ప్రారంభించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ రోజూ ఖాళీగా లేదు. కొన్ని అంశాలపై బామ్మకు నిశ్చితాభిప్రాయాలు ఉన్నాయి. ఆమె ఉద్దేశ్యం ప్రకారం పదవీవిరమణ వయస్సు 75 ఏళ్లట, అదీ..అనారోగ్య పరిస్థితుల్లో మాత్రమేనని చెబుతోంది. ఆరోగ్యం సహకరించినంతకాలం బయటకు రండి, సంతోషంగా పనిచేయండంటూ తన వయస్సు వారికి ఒక సలహా ఇచ్చిందీ బామ్మ.