: అమర వీరులను మరచి అమరావతికా?: కేసీఆర్ ను దుయ్యబట్టిన కాంగ్రెస్
నవ్యాంధ్ర రాజధాని అమరావతి శంకుస్థాపనకు వెళుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ అమరవీరులను మరచిపోయాడని కాంగ్రెస్ నేత, టీఎస్ పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య విమర్శించారు. ఈ మధ్యాహ్నం వరంగల్ లో మీడియాతో మాట్లాడిన ఆయన, తెలంగాణలో రైతుల ఆత్మహత్యలన్నీ ప్రభుత్వం చేస్తున్న హత్యలేనని ఆయన వ్యాఖ్యానించారు. అప్పుల బాధను తాళలేక, పూట గడవక ఆత్మహత్యలు చేసుకున్న రైతులను కేసీఆర్ అవమానిస్తున్నారని దుయ్యబట్టారు. రైతులకు తక్షణం పరిహారంతో పాటు ఇంటికో ఉద్యోగం ప్రకటించాలని పొన్నాల డిమాండ్ చేశారు. తెలంగాణ కోసం ప్రాణాలు వదిలిన అమరవీరులకు న్యాయం చేసిన తరువాతనే అమరావతికి కేసీఆర్ వెళ్లాలని ఆయన అన్నారు.