: విజయవాడలో కేసీఆర్ ఫ్లెక్సీల హల్ చల్
విజయవాడ నగరంలో ఏర్పాటు చేసిన కొన్ని ఫ్లెక్సీలు స్థానికులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఆ ఫ్లెక్సీలు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు సంబంధించినవి కావడమే దీనికి కారణం. ఒక ఫ్లెక్సీపై ఎడమవైపున కేసీఆర్ ఫొటోను ఉంచారు. కుడివైపున... "ఓ ఉద్యమ నాయకుడా, మీకు అభినందన మాల. అమరావతి అనే రాజధానికి మొదటి పునాది మీదే. మీ కృషి, పట్టుదల వల్లే మాకు లభించిన అపూర్వ బహుమతి అమరావతి... ఇట్లు మీ అభిమాన సంఘం, విజయవాడ" అని రాసి ఉంది. మరో ఫ్లెక్సీలో చంద్రబాబుతో కేసీఆర్ ఉన్న ఫొటో ఉంచారు. ఇలా పలు రకాల ఫ్లెక్సీలు విజయవాడలో దర్శనమిస్తున్నాయి. మరోవైపు, రేపు ఉదయం 10.45 గంటలకు నల్గొండ జిల్లా సూర్యాపేట నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో అమరావతికి కేసీఆర్ బయల్దేరుతారు.