: పూర్తికాని పిలుపుల పేరంటం... 23 వేల మంది భూములిచ్చిన రైతులకు అందని ఆహ్వానం!
వారంతా సదుద్దేశంతో రాజధానికి భూములను ఇచ్చేసిన రైతులు. వారందరినీ రాజధాని శంకుస్థాపన మహోత్సవానికి పట్టుబట్టలు పెట్టి మరీ ఆహ్వానించి సత్కరిస్తున్నట్టు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. వీరిని ఆహ్వానించే బాధ్యతను కలెక్టర్, ఎమ్మార్వోల భుజాలపై వేసింది. వారు కొందరు మహిళలను ఎంపిక చేసి వదిలేశారు. ఫలితం గత శనివారం నాడు అట్టహాసంగా మంత్రుల చేతుల మీదుగా చీర, పంచె, ధోవతి స్వీట్ బాక్స్ తో నేలపాడు గ్రామంలో ఆహ్వానాలు ఇవ్వడం మొదలైంది. తొలుత మంచి వస్త్రాలను ఇచ్చారని, ఆపై నాసిరకం పంచుతున్నారని అనంతవరం, బోరుపాలెం, అబ్బరాజుపాలెం రైతులు వాటిని తిరస్కరించి నిరసనలు కూడా తెలిపారు. ఈ సంగతి అటుంచితే, రేపు శంకుస్థాపన జరగనుండగా, ఇప్పటికీ 29 గ్రామాల్లోని 23 వేల మంది రైతులకు ఆహ్వానాలు అందలేదని తెలుస్తోంది. భూములిచ్చిన కొందరు రైతుల వివరాలు కంప్యూటర్లలో ఇంకా నిక్షిప్తం కాలేదని, అందువల్లే సమస్య ఏర్పడిందని చెప్పి అధికారులు తప్పించుకున్నారు. ఇక ఈ ప్రాంతంలో భూములను రాజధానికి ఇచ్చి పొరుగు రాష్ట్రాల్లో, విదేశాల్లో ఉన్న వారికి కూడా ఆహ్వానాలు అందలేదు. వీరిని ఎలా ఆహ్వానిస్తారన్న విషయమై అధికారులు కూడా సమాధానం చెప్పలేకపోతున్నారు. భారీ ఖర్చుతో అట్టహాసంగా జరుగుతున్న కార్యక్రమానికి తమను పిలవకపోవడంపై భూములిచ్చిన రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.