: పోలీసుల కస్టడీలో హార్దిక్ పటేల్ దసరా! తాజాగా డెకాయిట్ కేసు
గుజరాత్ పటేల్ వర్గం యువనేత హార్దిక్ పటేల్ పై కస్టడీలో భాగంగా పోలీసు అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. దాదాపు 8 గంటల పాటు ఆయన్ను ప్రశ్నించిన పోలీసులు, పలు పాత కేసులను ఆయన ముందు ప్రస్తావించి సమాధానాలు రాబట్టే ప్రయత్నాలు చేసినట్టు తెలిసింది. పటేల్ యువత ఆత్మహత్యలు చేసుకునే బదులు ఇద్దరు లేదా ముగ్గురు పోలీసులను హత్య చేయాలని హార్దిక్ మీడియా ఎదుట వ్యాఖ్యానించి కష్టాలు కొనితెచ్చుకున్న సంగతి తెలిసిందే. మూడు రోజుల క్రితం రాజ్ కోట్ లో క్రికెట్ మ్యాచ్ కి వెళుతున్న ఆయన్ను అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టులో హాజరు పరుచగా, తొలుత నిన్నటి వరకూ, ఆపై 23 సాయంత్రం 4 గంటల వరకూ పోలీసు కస్టడీని పొడిగించారు. తాజాగా ఆయనపై మరో కేసును కూడా పోలీసులు పెట్టారు. జూలై 23న జరిగిన పటీదార్ ర్యాలీలో జరిగిన హింసాత్మక ఘటన, లూటీల కేసుల్లో ఆయన్ను నిందితుడిగా చేర్చారు. మొత్తానికి హార్దిక్ పటేల్ దసరా పండగ పోలీసుల మధ్య కస్టడీలోనే జరిగిపోనుంది.