: అందరినీ ఆకర్షించే 'జయహో అమరావతి'... ఎలా ఉంటుందంటే!
అమరావతి శంకుస్థాపన సమయంలో సుమారు 3 గంటల పాటు సాగే సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా పలువురు కళాకారులు తమ ప్రతిభను చాటనున్న సంగతి తెలిసిందే. అన్నింటికన్నా, ప్రముఖ రచయిత జొన్నవిత్తుల రచించిన 'జయహో అమరావతి' అనే పాటకు కూచిపూడి నృత్య రూపకం సిద్ధమవుతోంది. దాదాపు 10 నిమిషాలు సాగే ఈ రూపకం అందరినీ ఆకర్షిస్తుందని రిహార్సల్స్ చూసిన వారు చెబుతున్నారు. ప్రపంచ దేశాల రాజధానులు కూడా అచ్చెరువొందేలా ఆంధ్రుల రాజధాని అమరావతి వర్థిల్లాలంటూ, కృష్ణా నది తీరాన అమరావతి ధగధగలు మళ్లీ మళ్లీ చూడాలనిపించేలా అభివృద్ధి సాధించాలంటూ సాగుతుందీ గీతం. తెలుగునాట వివిధ రంగాల ప్రముఖులను కీర్తిస్తూ, ప్రదర్శన సాగుతుంది. "జయజయహే అమరావతి, ఆంధ్ర రాజధాని, చంద్రకళా ప్రతిభాకృతీ, ఇంద్రభవన శ్రేణి..." అంటూ సాగే పాటలో భాగంగా వేదికపై 100 మందికి పైగా కూచిపూడి నృత్య కళాకారులు నర్తించనున్నారు.