: ఆత్మలు సంచరించే భయానక ప్రాంతాల్లో టాప్-5 ఇవి!
శీతాకాలం తలుపు తడుతోంది. ప్రపంచవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఆత్మలను గుర్తు చేసుకుంటూ 'హాలోవీన్' వేడుకలు జరుపుకునే వేళ. ఆత్మలు, దయ్యాలు ఉన్నాయని, అవి మనుషులను వెంటాడుతాయని నమ్మేవారు ఎంతో మంది ఉన్నారు. ప్లేబాయ్ డాట్ కాంలో ప్రచురితమైన ఓ ప్రత్యేక కథనం ప్రకారం, ప్రపంచంలోని టాప్-5 ఆత్మలు సంచరిస్తాయని నమ్మే భయానక ప్రాంతాలివి. * ది సిసిల్ హోటల్: కాలిఫోర్నియాలోని అందమైన లాస్ ఏంజిల్స్ లో ఈ హోటల్ ఉంది. ఈ హోటల్ చరిత్ర వింటేనే భయం కలుగుతుంది. ఇక్కడ ఎన్నో హత్యలు, ఆత్మహత్యలు జరిగాయి. ఇక్కడ తీసిన చిత్రాల్లో ఆత్మలు కనిపిస్తున్నట్టు ఎన్నో ఉదాహరణలు సామాజిక మాధ్యమాల్లో ఉన్నాయి. అక్కడ కాస్సేపు ఉంటే చాలు, మనసు భయంతో నిండుతుందన్నది వెళ్లి వచ్చిన వారి అనుభవం. * ది మెర్ట్ లెస్ ప్లాంటేషన్: లూసియానాలోని సెంయింట్ ప్రాన్స్ విల్లీలో ఓ భవంతి చుట్టూ పెరిగిపోయిన ఓ పెద్ద చెట్టు ఇది. శ్మశానంలో భవంతిని నిర్మించారని, అందువల్ల ఈ చెట్టుపై ఎన్నో దయ్యాలున్నాయని ప్రజలు నమ్ముతారు. అక్కడికి రాత్రుళ్లు వెళ్లి వచ్చిన వారి భయానక అనుభవాలు కోకొల్లలు. * ది విలిస్కా యాక్స్ మర్డర్ హౌస్: విలిస్కా అనే చిన్న నగరంలోని భవంతి ఇది. ఈ ఇంట్లోని అందరినీ ఓ గొడ్డలితో నరికి చంపారు. ఎప్పుడో ఆ భవనంలో క్షుద్రపూజలు చేశారని, అందులో భాగంగానే అత్యంత కిరాతకంగా నరబలులు జరిగాయని నమ్ముతారు. అప్పుడు చనిపోయిన వారంతా ఇప్పటికీ అక్కడే ఉన్నారని ఎంతో మంది చెబుతుంటారు. * ది క్వీన్ మేరీ: లాంగ్ బీచ్ లో క్వీన్ మేరీ ఉంది. టైమ్ మేగజైన్ నిర్వహించిన 'హంటెడ్ ప్లేసెస్' సర్వేలో అత్యంత భయానక ప్రాంతంగా తొలి స్థానంలో నిలిచింది. ఇక్కడికి వెళితే దయ్యాలు కనిపించక మానవట. ఇక రాత్రిపూట వెళితే... అమ్మో, ఇంకేమైనా ఉందా? అంటారు సమీపంలోని ప్రజలు. * ది షాన్లీ హోటల్: న్యూయార్క్ సమీపంలోని నపనోచ్ లో ఉందీ హోటల్. ఇది స్కూబీ డూ కార్టూన్ హోటల్ మాదిరిగా ఉంటుంది. ఇక్కడ ఎన్నో రహస్య గదులున్నాయి. ఆ గదుల్లో ఉన్న వారికి ఎదురైన చెప్పుకోలేని అనుభవాలు ఎన్నో.