: ‘పాక్’లో భారత పర్యాటకులకు ఉచిత భోజనం
ఇటీవల భారత్ పర్యటనకు వచ్చిన ఒక పాకిస్తానీ కుటుంబానికి ముంబయిలో చేదు అనుభవం ఎదురైన సంఘటనను ఎవ్వరూ మర్చిపోలేరు. ఏ హోటల్లోనూ వారికి వసతి లభించకపోవడంతో ముంబయిలోని రైల్వేస్టేషన్ లోనే తలదాచుకునే పరిస్థితి వారికి ఎదురైంది. ఈ సంఘటన పాకిస్థాన్ కు చెందిన ఒక వ్యాపారవేత్త ను కలచివేసింది. ఈ సంఘటన ఆయన ఒక మంచి నిర్ణయం తీసుకునేందుకు దోహదపడింది. విదేశీయులు పర్యటనకు వచ్చినప్పుడు వారికి ఎటువంటి అసౌకర్యం, ఇబ్బంది కలగకూడదన్న ఆలోచన చేశారు. పాకిస్థాన్ కు వచ్చే భారత పర్యాటకులకు ఉచిత భోజన పథకాన్ని ఆయన అమలు చేస్తున్నారు. పాకిస్థాన్ లో ‘డంకిన్ డోనట్స్’ 26 ఫ్రాంచైజ్ లు కలిగిన వ్యాపారవేత్త ఇక్బాల్ లతీఫ్... స్వల్పకాల పర్యటన కోసం పాకిస్థాన్ కు వచ్చే భారతీయులకు ఇస్లామాబాద్, లాహోర్, పెషావర్ బ్రాంచిల్లో అక్టోబర్ 17వ తేదీ నుంచి ఈ ఉచిత భోజనాన్ని అమలు చేస్తున్నాడు. ఇప్పటివరకు సుమారు 2,500 మంది భారతీయులు ఇక్కడ భోజనం చేశారు. అయితే, ఉచిత భోజనానికి ఆశించినంత స్పందన లేకున్నా తన వ్యాపారం మాత్రం 30 శాతం అభివృద్ధి చెందిందని లతీఫ్ అన్నారు. తాను చేపట్టిన ఈ కార్యక్రమానికి ఎంతోమంది వినియోగదారుల నుంచి అభినందనలు అందుతున్నాయన్నారు. సరిహద్దుల నుంచి పాకిస్తాన్ సైనికుడొకడు తనకు ఫోన్ చేసి అభినందనలు తెలిపాడన్నారు.