: ‘చిల్లీ కింగ్’ రోజుకు రెండున్నర కిలోల మిర్చి తింటాడు!
చైనాకు చెందిన లీ యోంగ్జిని ‘చిల్లీ కింగ్’ అని పిలుస్తుంటారు. ఎందుకంటే, రోజుకు 2.5 కిలోల మిర్చి తింటాడు. మిరపకాయల్నే భోజనంగా స్వీకరిస్తాడు. అసలు లీ యోంగ్జి దినచర్య మిరపకాయల్ని తినడంతోనే ప్రారంభమవుతుంది. పదేళ్ల వయస్సులో ఈ అలవాటు అతనికి అబ్బింది. ఎండు మిర్చి అంటే లీ యోంగ్జికి ప్రాణం. రోజూ తీసుకునే గుడ్లు, మాంసంను తినకుండా ఉండగలడేమోకానీ, మిరపకాయలను తినకుండా మాత్రం ఉండలేడు. అందుకే, అతని ఇంటి వెనుక ఉన్న తోటలో దాదాపు 8 రకాల మిర్చి పండిస్తున్నాడు. పదేళ్ల క్రితం ఆయన జీవితంలో జరిగిన ఒక సంఘటనను ఈ సందర్భంగా ప్రస్తావించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లీ యోంగ్జి కుమారుడు ఒక రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. అప్పుడు తీవ్ర ఒత్తిడికి గురైన ఆయన, రెండు ప్లేట్ల కారప్పొడి తిని, నీళ్లు తాగి, ఆస్పత్రికి వెళ్లేవాడు. వైద్యులు ఆయన్ని పరీక్షించి ఆరోగ్యం బాగానే ఉందని చెప్పేవారు. మిర్చి తినడం వల్ల ఆరోగ్యం బాగానే ఉంది కనుక, ఆ అలవాటు తాను ఎందుకు మానుకోవాలని లీ యోంగ్జి అంటున్నాడు.