: తమతో కలసి రావాలని మోదీకి కేజ్రీవాల్ వినతి
కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వాన్ని నిత్యమూ విమర్శించే ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్ ఈసారి రూటు మార్చారు. ఢిల్లీ పోలీసు వ్యవస్థలో అవినీతి నిండిందని, కేంద్రం చేతుల్లోనే ఢిల్లీ పోలీసులు ఉండాలన్న మొండి వైఖరిని వీడి ప్రక్షాళనకు తమతో కలసి రావాలని కేజ్రీవాల్ కోరారు. ఢిల్లీ పోలీసు వ్యవస్థ సంస్కరణకు తమకు ఏడాది సమయం ఇవ్వాలని, అందరినీ సన్మార్గంలోకి తెస్తామని ఆయన అన్నారు. కాగా, అన్ని రాష్ట్రాల ప్రతినిధులు, నేతలు, కేంద్రమంత్రులు నిత్యమూ వచ్చి వెళ్లే ఢిల్లీలో వారి భద్రత నిమిత్తం పోలీసు వ్యవస్థ అంతా కేంద్ర ప్రభుత్వం నియమించిన లెఫ్టినెంట్ గవర్నరు చేతుల్లో ఉంటుందన్న సంగతి తెలిసిందే. దీంతో ఆప్ ఏ కార్యక్రమం చేపట్టినా, దానికి పోలీసుల నుంచి అడ్డంకులు రావడం సర్వసాధారణమై పోయింది. రాష్ట్రాన్ని ఏలుతున్నప్పటికీ పోలీసులపై పెత్తనం చేయలేని స్థితి. ఇదే సమయంలో నగరంలో అత్యాచారాలు పెరిగిపోతుండటం, ప్రజల్లో వ్యతిరేకత వస్తుండటంతో, పోలీసుల వైఫల్యాలను కేజ్రీవాల్ ఎండగడుతున్నారు. అందులో భాగంగానే వ్యవస్థను ప్రక్షాళన చేయాలని, అందుకు సహకరించి తమకు అధికారాలు ఇవ్వాలని ప్రధానిని కోరారు.