: దసరా నాడే 'యాదాద్రి' పనులు ప్రారంభం... కేసీఆర్ లేకుండానే!


తెలంగాణలో అతిపెద్ద పుణ్యక్షేత్రంగా యాదగిరిగుట్టను తీర్చిదిద్దాలన్న కేసీఆర్ ఆకాంక్షకు అనుగుణంగా దసరా పర్వదినం నాడు పనులు ప్రారంభం కానున్నాయి. భారీ ఎత్తున నిధులు వెచ్చించి చేపట్టనున్న పనులు ముఖ్యమంత్రి కేసీఆర్ లేకుండానే మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దసరా నాడు ఉదయం 11 గంటలకు కొండపైన, 11:30 గంటలకు కొండ కింద అభివృద్ధి పనులకు సుముహూర్తం నిర్ణయించినట్టు ఆలయ ప్రధాన అర్చకులు సుందరరాజన్ వెల్లడించారు. ఆ సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నవ్యాంధ్ర పర్యటనలో ఉంటారు. ఒకవేళ రెండు కార్యక్రమాలకు హాజరు కావాలని ఆయన భావిస్తే, అమరావతి శంకుస్థాపన పూజా కార్యక్రమాలకు హాజరు కాలేని పరిస్థితి ఏర్పడుతుంది. కాగా, మొత్తం 2.33 ఎకరాల్లో యాదాద్రి ఆలయ ప్రాకార నిర్మాణం జరుగుతుందని, దీంతో పాటు మహా మండపం, క్యూలైన్లు, వీఐపీల రాకపోకలకు ఏర్పాట్లు చేయనున్నట్టు అధికారులు తెలిపారు. స్వయంభూ విగ్రహాలను కదిలించకుండా పనులు జరుగుతాయని తెలిపారు. మాడ వీధులు, ప్రసాద అమ్మకాల గదులు, కల్యాణ మండపం, ఆళ్వార్ సన్నిధి, బ్రహ్మోత్సవాలకు ప్రత్యేక మండపాలు నిర్మిస్తామన్నారు. మొత్తం 1,650 ఎకరాలు వైటీడీఏ పరిధిలోకి వచ్చాయని వివరించారు. పనుల ప్రారంభోత్సవానికి తెలంగాణ మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, జగదీశ్ రెడ్డిలతో పాటు దేవాదాయ శాఖ కమిషనర్ ఇతర అధికారుల రాక ఖరారైనట్టు తెలిపారు.

  • Loading...

More Telugu News