: మరో రెండేళ్లు ఇండియా ఇంతే, పెట్టుబడికి రిస్కే: ఎస్ అండ్ పీ
వచ్చే రెండేళ్ల పాటు ఇండియాపై వ్యాపార దృక్పథాన్ని మార్చే అవకాశాలు లేవని ప్రముఖ రేటింగ్ సంస్థ స్టాండర్డ్ అండ్ పూర్ (ఎస్ అండ్ పీ) వెల్లడించింది. ప్రస్తుతమున్న 'లోయస్ట్ ఇన్వెస్ట్ మెంట్' (బీబీబీ) గ్రేడ్ ను సవరించలేమని స్పష్టం చేసింది. 2015-18 మధ్యకాలంలో ఇండియా ఆర్థిక వృద్ధి సగటున 8 శాతానికి చేరవచ్చని, దీర్ఘకాలంలో భారత పెట్టుబడులపై 'బిబిబి' రేటింగ్, స్వల్పకాలానికి 'ఏ-3' కొనసాగుతుందని వివరించింది. కాగా, పెట్టుబడుల దృక్పథ రేటింగుల్లో 'బిబిబి' అతి తక్కువ. ఈ రేటింగ్ ఉన్న దేశాల్లో రిస్క్ ఎక్కువనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. ప్రస్తుత దేశ పరిస్థితులను అధ్యయనం చేసిన తరువాతనే ఈ నిర్ణయానికి వచ్చినట్టు ఎస్ అండ్ పీ వెల్లడించింది. ఇప్పటికే మూడీస్, ఫిచ్ వంటి రేటింగ్ సంస్థలు ఇండియాను లోయస్ట్ ఇన్వెస్ట్ మెంట్ గ్రేడ్ లో ఉంచిన సంగతి తెలిసిందే.