: తన మరణాన్ని ముందే ఊహించిన ఇందిరా గాంధీ, వారసురాలిగా ప్రియాంక పేరు ప్రతిపాదన!
భద్రతను పర్యవేక్షించాల్సిన సాయుధుల చేతుల్లోని తూటాలకు బలైన మాజీ ప్రధాని ఇందిరాగాంధీ తన మరణాన్ని ముందుగానే ఊహించారని కాంగ్రెస్ సీనియర్ నేత, ఇందిరకు నమ్మినబంటుగా గుర్తింపు తెచ్చుకున్న ఎంఎల్ ఫోతేదార్ తెలిపారు. తన రాజకీయ వారసురాలిగా ప్రియాంక కొనసాగాలన్నది అప్పట్లో ఆమె అభిమతమని తెలిపారు. తన పోలికలు ప్రియాంకలో ఉండటంతో, భవిష్యత్తులో ఆమె గొప్ప నేత అవుతుందని ఇందిర తనతో వ్యాఖ్యానించినట్టు ఫోతేదార్ 'టైమ్స్ ఆఫ్ ఇండియా'కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో వెల్లడించారు. తదుపరి శతాబ్దానికి ప్రియాంక గొప్ప నేత అవుతుందని ఇందిర గట్టిగా నమ్మేవారని ఆయన అన్నారు. "ఇందిరా గాంధీ హత్యకు సరిగ్గా మూడు రోజుల ముందు, శనివారం నాడు నేను ఆమెతో కలసి కాశ్మీర్ లోని ఓ దేవాలయం దర్శనానికి వెళ్లాను. తిరిగి ఢిల్లీ బయలుదేరిన తరువాత ఆమె మనసులోని మాటలు బయటకు వచ్చాయి. ఆమె ప్రియాంక గురించి ప్రస్తావించడం మొదలు పెట్టారు. బహుశా ప్రియాంక తన వారసురాలు కావాలన్న కోరికను బయట పెట్టాల్సిన సమయం అదేనని ఆమె భావించారేమో. ఆ రాత్రే ఇందిర నోటి వెంట వచ్చిన ప్రతి పదాన్నీ నేను రాసుకున్నాను" అని ఆయన తెలిపారు. ఈ విషయాన్ని ఇందిరా గాంధీ మరణానంతరం, తాను రాజీవ్ కు చెప్పానని, అప్పుడే సోనియాకూ వెల్లడించానని అన్నారు. ఇందిర, ప్రియాంకల మధ్య తనకు ఎటువంటి తేడాలూ కనిపించడం లేదని అన్నారు. ఇప్పటికైతే ప్రియాంక సాధారణంగానే ఉన్నప్పటికీ, వేచి చూడాలని, ఇందిర కోరుకున్నట్టుగా తదుపరి శతాబ్దం ప్రియాంకదేనని నమ్ముతున్నానని ఆయన తెలిపారు.