: తిరుమలలో అర్చకుల మధ్య ముదిరిన వివాదం... రమణ దీక్షితులు, వేణుగోపాల్ దీక్షితుల మధ్య వాగ్వాదం
ఏడుకొండల వెంకన్న క్షేత్రంలో అర్చకుల మధ్య విభేదాలు నానాటికీ ముదురుతున్నాయి. మొన్న వాహన సేవల విషయంలో తనకు తెలియకుండా డ్యూటీలను ఎలా మారుస్తారని ప్రధానార్చకులు రమణ దీక్షితులు ఆలయ పేష్కార్ పై బహిరంగంగానే ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం మరువక ముందే, ఈ ఉదయం సూర్యప్రభ వాహన సేవలో డ్యూటీల విషయమై వివాదం జరిగింది. నెల రోజుల క్రితమే సూర్యప్రభ వాహన సేవను వేణుగోపాల్ దీక్షితులకు టీటీడీ కేటాయించినట్టు తెలుస్తోంది. ఈ ఉదయం విధులను వేరేవారికి అప్పగిస్తున్నట్టు అధికారులు వెల్లడించగా, రమణ దీక్షితులు కావాలనే తనకు వేసిన డ్యూటీలను మార్పించారని వేణుగోపాల్ ఆరోపించారు. ఇదే విషయమై రమణ దీక్షితులను ఆయన నిలదీశారు. దీంతో ఇద్దరి మధ్యా వాగ్వాదం జరిగింది. పవిత్ర బ్రహ్మోత్సవాలు జరుగుతున్న వేళ ఈ అర్చకుల వివాదమేంటని భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.