: రేవంత్... మొత్తానికి ధైర్యవంతుడివే!... టీ టీడీఎల్పీ ఉపనేతపై గవర్నర్ కామెంట్
టీడీపీ తెలంగాణ శాఖ వర్కింగ్ ప్రెసిడెంట్, టీ అసెంబ్లీలో ఆ పార్టీ ఉపనేత రేవంత్ రెడ్డిపై నిన్న తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ఆసక్తికర కామెంట్ చేశారు. రైతుల రుణమాఫీపై కేసీఆర్ సర్కారు అవలంబిస్తున్న వైఖరిని నిరసిస్తూ చేపట్టిన ఆందోళన అనంతరం టీ టీడీపీ నేతలు రాజ్ భవన్ లో గవర్నర్ ను కలిశారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డిని చూసిన గవర్నర్ ‘‘మొత్తానికి ధైర్యవంతుడివే’’ అని వ్యాఖ్యానించారు. గతంలో అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం సందర్భంగా కుర్చీని లాగిన రేవంత్ ఘటనను ప్రస్తావించిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్య చేశారు. అయితే నాటి ఘటనలో అసలు విషయాన్ని చెప్పేందుకు యత్నించిన టీ టీడీపీ నేతలను గవర్నర్ వారించారు. ‘‘నాకు రేవంత్ గురించి తెలుసు. నా గురించి రేవంత్ కు తెలుసు. మీరు చెప్పనవసరం లేదు’’ అని కూడా గవర్నర్ అన్నారు. దీంతో స్పందించిన రేవంత్ రెడ్డి ‘‘సార్... ఆ రోజు అసెంబ్లీలో నేనూ, హరీశ్ రావు ఇద్దరం కలిసి కుర్చీ లాగాం. కాని మీరు హరీశ్ ను మరచిపోయి నన్ను మాత్రమే గుర్తు పెట్టుకొన్నారు’’ అని వ్యాఖ్యానించగా, గవర్నర్ చిరునవ్వుతో ఇక అంశానికి ఫుల్ స్టాప్ పెట్టేశారు.