: అవినీతిని నిరూపిస్తే రాజకీయ సన్యాసం... కాంగ్రెస్ కు కేటీఆర్ సవాల్
తెలంగాణలో అధికార పక్షం టీఆర్ఎస్, ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ ల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. వరంగల్ లోక్ సభకు జరగనున్న ఉప ఎన్నికల దరిమిలా రెండు పార్టీల కీలక నేతలు నేరుగా రంగంలోకి దూకేశారు. నిన్న ఆదిలాబాదు జిల్లా దిలావర్ పూర్ లో వాటర్ గ్రిడ్ పైలాన్ ను ఆవిష్కరించిన సందర్భంగా ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్) కాంగ్రెస్ నేతలపై విరుచుకుపడ్డారు. తమపై అవినీతి ఆరోపణలను రుజువు చేస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని ఆయన ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన జానారెడ్డి పేరును ప్రస్తావించకుండానే ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘‘టీడీపీ, కాంగ్రెస్ ప్రభుత్వాల్లో కీలక మంత్రి పదవులు నిర్వహించిన ఓ పెద్ద మనిషి వాటర్ గ్రిడ్ కు డీపీఆర్ ఉందా? అంటూ ప్రశ్నించం హాస్యాస్పదం’’ అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ‘‘కాంగ్రెస్ నాయకులు మర్యాద ఇస్తే మేం మర్యాద ఇస్తాం. వారు తమలపాకులతో కొడితే, మేము తలుపు చెక్కతో కొట్టేందుకు సిద్ధంగా ఉన్నాం’’ అని కూడా కేటీఆర్ హెచ్చరించారు.