: వెనుదిరిగి చూడని స్టాక్స్... కోటి కోట్ల రూపాయలను దాటిన ఇన్వెస్టర్ల సంపద
సెషన్ ఆరంభంలో ఒడిదుడుకుల మధ్య పడుతూ, లేస్తూ సాగిన సూచికలు మధ్యాహ్నం 12 గంటల తరువాత దూసుకెళ్లాయి. ఆసియా మార్కెట్ల నుంచి అందిన సంకేతాలు ఇన్వెస్టర్ల సెంటిమెంటును పెంచడంతో, విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లతో పాటు దేశవాళీ ఫండ్ కంపెనీలు, రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి మంచి కొనుగోలు మద్దతు కనిపించింది. దీంతో బెంచ్ మార్క్ సూచికలు చెప్పుకోతగ్గ లాభాలను నమోదు చేయగా, లిస్టెడ్ కంపెనీల్లోని ఇన్వెస్టర్ల సంపద కోటి కోట్ల రూపాయలను అధిగమించింది. సోమవారం నాటి సెషన్ ముగిసేసరికి బీఎస్ఈ సెన్సెక్స్ 150.32 పాయింట్లు పెరిగి 0.55 శాతం లాభంతో 27,364.92 పాయింట్ల వద్ద, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ సూచిక నిఫ్టీ 39.60 పాయింట్లు పెరిగి 0.45 శాతం లాభంతో 8,275.05 పాయింట్ల వద్దకు చేరాయి. బీఎస్ఈలో మిడ్ క్యాప్ 0.69 శాతం, స్మాల్ క్యాప్ 0.77 శాతం పెరిగాయి. గత వారం చివరి సెషన్ నాడు రూ. 99,79,978 కోట్ల వద్ద ఉన్న బీఎస్ఈ లిస్టింగ్ కంపెనీల మార్కెట్ కాప్ రూ. 1,00,36,282 కోట్లకు చేరింది. ఎన్ఎస్ఈ-50లో రిలయన్స్ ఇండస్ట్రీస్ అత్యధికంగా 5.50 శాతం లాభపడింది. భారతీ ఎయిర్ టెల్, హెచ్సీఎల్ టెక్, హిందుస్థాన్ యూనీలివర్, ఇన్ఫోసిస్ తదితర కంపెనీలు లాభపడగా, ఓఎన్జీసీ, టాటా స్టీల్, టాటా మోటార్స్, అల్ట్రా టెక్ సిమెంట్స్, అదానీ పోర్ట్స్ తదితర కంపెనీలు నష్టపోయాయి.