: తెలంగాణలో మాత్రం రేపు ప్రభుత్వ సెలవు... ఏపీలో పనిదినమే!
రేపు తెలంగాణలో ప్రభుత్వ కార్యాలయాలు పని చేయవని ప్రభుత్వం స్పష్టం చేసింది. తెలంగాణలో ముఖ్య పర్వదినమైన సద్దుల బతుకమ్మగా సెలవు ప్రకటిస్తున్నట్టు ప్రభుత్వం నేడు విడుదల చేసిన జీవోలో ప్రకటించింది. సద్దుల బతుకమ్మ వేడుకలను ట్యాంక్ బండ్ పై ఘనంగా నిర్వహించాలని తలపెట్టిన కేసీఆర్ ప్రభుత్వం అందుకు తగ్గ ఏర్పాట్లు చేస్తోంది. కాగా, రేపు సాయంత్రం 4.30 గంటలకు ఎల్బీ స్టేడియం నుంచి ట్యాంక్ బండ్ వరకు బతుకమ్మలతో భారీ ర్యాలీకి ఏర్పాటు చేసిన ప్రభుత్వం, ఇప్పటికే ట్యాంక్ బండును సర్వాంగ సుందరంగా ముస్తాబు చేసింది. ఎల్ఈడీ లైట్లతో కూడిన బెలూన్లు, ప్రత్యేక బాణసంచా ఏర్పాట్లూ ప్రధాన ఆకర్షణ కానున్నాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా అధికారులు బందోబస్తు చర్యలు ఏర్పాటు చేయగా, రేపు ట్యాక్ బండ్ వైపు వెళ్లే వాహనాలను ఇతర రూట్లలోకి మళ్లించనున్నట్టు పోలీసులు వెల్లడించారు. కాగా, రేపు దుర్గాష్టమి పర్వదినం కాగా, ఏపీలో మాత్రం ప్రభుత్వ కార్యాలయాలు మామూలుగానే పనిచేయనున్నాయి. ఎల్లుండి మహర్నవమి, ఆపై దసరా, మరుసటి రోజు మొహర్రం సందర్భంగా వరుస సెలవులను ఏపీ సర్కారు ప్రకటించింది.